పెట్టుబడులకు ‘ఫ్యూచర్’!

28-11-2026 | 05:40am
  1. డిసెంబర్ 7 నుంచి 9 వరకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’
  2. భారత్ ఫ్యూచర్ సిటీలో భారీ ఏర్పాట్లు 
  3. వెయ్యికి పైగా కంపెనీల భాగస్వామ్యం, 1,300 మంది అతిథుల రాక 
  4. పెట్టుబడుల ఒప్పదాలు, కొత్త పారిశ్రామిక విధానాల ఆవిష్కరణ   

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ సదస్సుకు సిద్ధమైంది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంగణంలో ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్(Invest Telangana Global Summit) జరగనుంది. గతేడాది నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు మించి ఈసారి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, వివిధ రంగాల నిపుణులు హాజరుకానున్నారు.

రాష్ర్టంలో పరిశ్రమల విస్తరణ, కొత్త పెట్టుబడుల రాక, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావడంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. గతేడాది ప్రకటించిన ‘తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలను కార్యరూపంలోకి తీసుకురావడంలో ఈ సదస్సు కీలకం కానుంది. రాష్ర్టంలో ఉన్న పారిశ్రామిక అవకాశాలను అంతర్జాతీయ సంస్థలకు పరిచయం చేయడంతో పాటు ఇప్పటికే పెట్టుబడులకు ముందుకొచ్చిన కంపెనీల ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా అవసరమైన సహకారం అందించనున్నారు.   

మూడు రెట్లకు పైగా ప్రాంగణం విస్తరణ

గతేడాది 27,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో గోబల్ సమ్మిట్ నిర్వహించగా.. ఈసారి 80 వేల చదరపు మీటర్లకుపైగా ప్రాంగణా న్ని సిద్ధం చేస్తున్నారు. అప్పట్లో ఒకే ఎక్స్‌పో హాల్ అందుబాటులో ఉండగా.. ఇప్పుడు ఆరు భారీ హాళ్లను నిర్మిస్తున్నారు. ప్రదర్శనశాలల విస్తీర్ణాన్ని 3,200 చదరపు మీటర్ల నుంచి 60,600 చదరపు మీటర్లకు పెంచారు. ప్రధాన సమావేశ వేదిక కోసం 10 వేల చదరపు మీటర్ల స్థలాన్ని కేటాయించారు.

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కళలు, పారిశ్రామిక రంగంలో సాధించిన పురోగతిని అంతర్జాతీయ ప్రతినిధులకు పరిచయం చేసేందుకు ప్రత్యేకంగా తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే 1,300 మందికిపైగా ప్రత్యేక ఆహ్వానితులు అంగీకారం తెలిపారు. వీరిలో 220 మందికి పైగా విదేశీ ప్రతినిధులు ఉన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం తదితర రంగాలకు చెందిన 1,059 కంపెనీలు తమ ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించేందుకు ముందుకొచ్చాయి.    

ఒకే వేదికపై ఏడు మెగా ఈవెంట్లు

రక్షా ఎక్స్‌పో, యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ రంగాలకు సంబంధించి ఇండియా జాయ్, యువ పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలతో స్టార్టప్ ఎరీనా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. వీటితో పాటు క్లైమేట్ కాన్‌క్లేవ్, ఎడ్యుకేషన్ కాన్‌క్లేవ్, ట్రైబల్ సమ్మిట్, తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్, ఎలక్ట్రిక్ వాహనాలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ప్రదర్శనశాలలు ఉంటాయి.

పెద్ద కంపెనీలతో పాటు చిన్న పరిశ్రమలు, స్టార్టప్లకు అంతర్జాతీయ సంస్థలతో వ్యాపార సంబంధాలు ఏర్పరచుకునే అవకాశం లభించనుంది. మూడు రోజుల సదస్సులో వివిధ అంశాలపై 77 సమావేశాలు నిర్వహణకు కార్యాచరణ రూపొందించారు. పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశాలు, పెట్టుబడుల ఒప్పందాలు, కొత్త పారిశ్రామిక విధానాల ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి గ్లోబల్ సమ్మిట్‌ను కేవలం పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకే పరిమితం చేయకుండా ప్రజలకు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

డిసెంబర్ 7 నుంచి 9 వరకు ప్రధాన సదస్సు జరుగుతుంది. అనంతరం డిసెంబర్ 13 వరకు రక్షా ఎక్స్‌పో, ఇండియాజాయ్ ప్రదర్శనలను ప్రజలు సందర్శించే అవకాశం కల్పించనున్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, గడ్డం వివేక్ వెంకటస్వామి సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం సదస్సు ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును విజయవంతంగా నిర్వహించేందుకు వివిధ విభాగాలకు పది కమిటీలను ఏర్పాటు చేశారు. అదనంగా 144 మంది గ్రూప్ 141 మంది గ్రూప్ ప్రొబేషనరీ అధికారులను ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహణ బాధ్యతలను అప్పగించింది. 

వాతావరణ మార్పులపై కార్యాచరణ

గ్లోబల్ సమ్మిట్‌లో భాగంగా డిసెంబర్ 7, 8 తేదీల్లో నిర్వహించనున్న క్లైమేట్ కాన్‌క్లేవ్‌కు వెయ్యి మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్, హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థకు చెందిన దాజీ, ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హిమ్‌తో పాటు అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థల నిపుణులు  పాల్గొంటారు. కరువు నివారణ, వడగాలుల నుంచి రక్షణ, పచ్చదనం పెంపు, వాతావరణ విపత్తులపై జిల్లాలవారీగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థ, వ్యర్థాల పునర్వినియోగం, పర్యావరణహిత ఇంధన వనరుల అభివృద్ధి అంశాలపై ఆరు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

8వ తేదీన సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఎల్‌ని నో ప్రభావాన్ని ఎదుర్కొనే ముందస్తు ప్రణాళికతో పాటు వాతావరణ మార్పులపై తెలంగాణ ప్రత్యేక కార్యాచరణను విడుదల చేయను న్నారు. రానున్న ఆరు నెలలు, ఏడాది, ఐదేళ్లలో చేపట్టాల్సిన చర్యలను ఇందులో పొందుపరచ నున్నారు. వివిధ ప్రభుత్వ శాఖలకు నిర్దిష్ట బాధ్యతలు అప్పగించేలా ప్రణాళిక రూపొందించారు. పర్యావరణ పరిరక్షణకు తోడు హరిత పరిశ్రమలు, ఉపాధి అవకాశా ల పెంపునకు పెట్టుబడులను ఆకర్షించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది.

మరిన్ని వార్తలు