ప్రతి పదేళ్లకు డీలిమిటేషన్ జరగాలి

28-11-2026 | 05:30am
  1. సీట్లు పెరిగితే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల గొంతు పెరుగుతోంది
  2. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే
  3. లోక్‌సభ ఎన్నికల వరకు ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలన!
  4. ప్రతి ఆదివారం నషాముక్త్ భారత్ సైక్లింగ్ ర్యాలీ
  5. ఈ నెల 29న వెయ్యి సైకిళ్లతో నెక్లెస్ రోడ్డులో సైకిల్ రైడ్
  6. బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): ప్రతి పదేళ్లకు డీలిమిటేషన్ జరగాలని, సీట్లు పెరిగితే చట్టసభల్లో ఎస్సీ, ఎస్టీల గొంతు కూడా పెరుగుతోందని బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్(BJP MP K. Laxman) అన్నారు. గతంలో మహిళా బిల్లును అడ్డుకున్నవారికి పలు రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు ప్రజలు బుద్ధిచెప్పారన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో చిట్‌చాట్ చేస్తూ మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ వరకు డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోలే తరువాత జనాభాకు అనుగుణంగా చేయా ల్సి వస్తుందని లక్ష్మణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

డీలిమిటేషన్‌ను కాంగ్రెస్ 50 ఏళ్లుగా నాన్చుతుందన్నారు. జీడీపీ ఆధారంగా సీట్లు పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. జీడీపీ ప్రతి సంవత్సరం మారుతుంది.. ఎంపీ సీట్లు కూడా ప్రతి సంవత్సరం పెంచడం, తగ్గించడం సాధ్యపడుతుందా? అని ఆయన ప్రశ్నించారు. డీలిమిటేషన్ ప్రతి పదేళ్లకు ఒక సారి జరగాలని, కానీ, ఇంత వరకూ కాంగ్రెస్ చేయకుండా తొక్కిపెట్టిందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2029లోనే జరుగుతాయని, లోక్‌సభ ఎన్నికల వరకు ఐదు నెలల పాటు రాష్ట్రపతి పాలన విధించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు, తరువాత ఏడాదిలోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాలన్నింటికీ 2029లోనే ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు. కులగణనలోనే ఓబీసీ గణన ఉంటుందన్నారు. ఏ బిల్లు పెట్టిన రాహుల్ గాంధీ అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రధాన ఎజెండాగా మారనుందన్నారు. పునర్విభజన బిల్లు 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉందని, వాటికి పరిష్కారం చూపడమే మోదీ లక్ష్యమన్నారు. మహిళగా ఉన్న సోనియా కూడా మహిళా బిల్లు ను వ్యతిరేకించారన్నారు.

2029 ఎన్నికల్లోనే చట్టసభల్లో అడుగుపెట్టాలనే ఉద్దేశ్యంతో బిల్లు ప్రవేశపెట్టాలని బిల్లు తెస్తున్నామన్నారు. జనగణన తర్వాత డీలిమిటేషన్ చేస్తే దక్షిణాదికి అన్యా యం జరుగుతుందని, ఉన్న సీట్లు తగ్గుతాయన్నారు. అందుకే జనగణనకు ముందే పెడుతున్నామని, కాబట్టి దక్షిణాదికి అన్యాయం జరగదని వెల్లడించారు. ఇప్పుడున్న సీట్లలో 50 శాతం పెరుగుతాయన్నారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కలలు కంటున్నదని, ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్నారు.

ఇప్పటి వరకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పాలనను, అవినీతిని చూసిన ప్రజలు బీజేపీకి అవకాశమివ్వాలని భావిస్తున్నారన్నారు. నషా ముక్త్ భారత్ అనేది ప్రభుత్వాలే కాదు పౌర సమాజం అనుకుంటేనే సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 29న వెయ్యి సైకిళ్లతో ఐమ్యాక్స్ హెచ్‌ఎండీఏ గ్రౌండ్ నుంచి నెక్లెస్ రోడ్డులో రైడ్‌ను నిర్వహిస్తామని చెప్పారు. తర్వాత ప్రతి ఆదివారం జనగాం, నర్పంపేట, సంగారెడ్డి, నల్లగొండ తదితర జిల్లాల్లోనూ సైకిల్ ర్యాలీలు చేపడతామన్నారు. డ్రగ్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సెమినార్స్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. తాను చేసే సైకిల్ రైడ్‌లో ఈగల్ టీమ్ పాల్గొంటుందన్నారు.

మరిన్ని వార్తలు