మహిళలు రాజకీయాల్లో రాణించాలి

28-11-2026 | 05:25am

పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఎదగాలి

టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత

హైదరాబాద్, నవంబర్ 27 (విజయక్రాంతి): మహిళలు రాజకీయాల్లో అన్ని స్థాయిల్లో ఎదగాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పిలుపునిచ్చారు. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు మహిళలు జెండా ఎగురవేసే వరకు తాను ఆర్థికంగా, హార్దికంగా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. భారత రాజ్యాంగం మహిళలకు హక్కులు, సమానత్వం, ఓటు హక్కు కల్పించిందని, రాజ్యాంగాన్ని ఆమోదించుకున్న నవంబర్ 26నే మహిళలకు నిజమైన పండుగ రోజని పేర్కొన్నారు.

గురువారం రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మహిళలు సదస్సులో కవిత పాల్గొని ప్రసంగించారు. వేల ఏళ్లుగా మహిళలను ఒక వస్తువుగా, ఆస్తిగా మాత్రమే చూశారని, రాజ్యాంగం వచ్చిన తర్వాతే మహిళలకు సమాన హక్కులు లభించాయని అన్నారు. రాజ్యాంగం మహిళలకు ఎన్నో హక్కులు కల్పించినప్పటికీ క్షేత్రస్థాయిలో వాటి అమలు సరిగా జరగడం లేదని కవిత ఆవేదన వ్యక్తం చేశారు.

పురుషులతో సమానంగా పనిచేస్తున్నప్పటికీ మహిళలకు సమాన వేతనం ఇవ్వడం లేదన్నారు. ఇళ్లు, భూములు, ఆర్థిక స్వాతంత్య్రం విషయంలోనూ మహిళలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. కులం, మతంతో సంబంధం లేకుండా మహిళలపై వివక్ష కొనసాగుతోందని, మహిళలను పురుషులతో సమానంగా చూడాలని మాత్రమే కోరుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రైతాంగ పోరాటంపై వచ్చిన 21 పుస్తకాల్లో 20 పుస్తకాలను పురుషులే రాశారని, మహిళల పాత్రకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని పేర్కొన్నారు.

చాకలి ఐలమ్మ పోరాటం వంటి చరిత్రను గుర్తు చేసుకుంటూ మహిళలు తమ చరిత్రను తామే రాసుకోవాలని పిలుపునిచ్చారు. సమాజం కోసం పనిచేసే మహిళలను ఇప్పటికీ అవమానిస్తున్నారని కవిత అన్నారు. మహిళలు విమర్శలకు భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళలకు పెన్షన్లు, బంగారం, సైకిళ్లు ఇస్తామని హామీలు ఇవ్వడం కంటే ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాలు, ఆర్థిక స్వాతంత్య్రం, రాజకీయాల్లో అవకాశాలు కల్పించాలని కవిత అన్నారు.

మహిళలు ఎవరికీ భయపడకుండా తమ మనస్సాక్షికి అనుగుణంగా రాజకీయాల్లోకి రావాలని కోరారు. మహిళలకు అవకాశాలు కల్పించేందుకే తాను పార్టీ పెట్టానని స్పష్టం చేశారు. తెలంగాణ రక్షణ సేన మహిళా విభాగానికి ఇకపై ‘తెలంగాణ రుద్రమ సేన’గా పేరు మారుస్తున్నట్లు కవిత ప్రకటించారు. ఈ సందర్భంగా మహిళా నాయకులతో కలిసి రుద్రమ సేన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో మనోజ గౌడ్, వేముల భవాని, సూరారపు కృష్ణవేణి, కావేటి సబిత, సండ్ర మాలతి, పగిడాల శ్రావణి, రజియా బేగం, హలిమా బేగం, తిరుపతి పరమేశ్వరీ, లలితా యాదవ్, సౌజన్య రెడ్డి తదితర మహిళా నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు