ఉపాధినిచ్చే నైపుణ్యం కల్పిస్తాం
- ఏఐ, రోబోటిక్స్ సాంకేతికతతో ప్రభుత్వ విద్యాసంస్థల ఆధునీకరణ
- పాలిటెక్నిక్ విద్యార్థులకు పరిశ్రమల్లో 3 నుంచి 6 నెలల ప్రాక్టికల్ శిక్షణ
- రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,500 కోట్లతో ఏటీసీలుగా మారుస్తున్నాం
- ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- షాద్‌నగర్‌లో రూ.40 కోట్ల విద్యా ప్రాజెక్టులకు శంకుస్థాపన
రంగారెడ్డి బ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన, సాంకేతిక విద్య, ఉపాధినిచ్చే నైపుణ్యాలను అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఐటీ, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(IT Minister Sridhar Babu) స్పష్టం చేశారు. శుక్రవారం షాద్‌నగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి రెండు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
ఫరూఖనగర్ మండలం బూర్గుల గ్రామంలో రూ.10 కోట్లతో నిర్మించనున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు, లింగారెడ్డిగూడలో సుమారు రూ.30 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నూతన భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సమూలంగా మార్చి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నాం. విద్యార్థులకు కేవలం సర్టిఫికెట్లు, డిగ్రీలు మాత్రమే కాకుండా, మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను అందించడమే మా ధ్యేయం’ అని పేర్కొన్నారు. ఇం దులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,500 కోట్లతో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా ఆధునికీకరిస్తున్నామన్నారు.
వీటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్, మెషిన్ లెర్నింగ్ వంటి భవిష్యత్ సాంకేతికతలపై యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు. పాలిటెక్నిక్ విద్యార్థులకు చదువుతో పాటు పరిశ్రమల్లో 3 నుంచి 6 నెలల పాటు ప్రాక్టికల్ ఇంటర్న్‌షిప్ కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. యువతకు మెరుగైన ఉపాధి కల్పించేందుకే ‘యంగ్ ఇం డియా స్కిల్స్ యూనివర్సిటీ’ని ఏర్పాటు చేశామన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ రంగంలో 70 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించామని, మెగా డీఎస్సీ ద్వారా 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించి విద్యా వ్యవస్థలో పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలోనూ స్థానిక యువతకు నైపుణ్యాల ఆధారంగా ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామని తెలిపారు. బూర్గులలో నిర్మిస్తున్న తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి మంత్రి వివరిస్తూ.. ఈ పాఠశాలలో విద్యార్థులకు అత్యాధునిక డిజిటల్ తరగతి గదులు, సువిశాలమైన క్రీడా మైదానం, హాస్టల్, డైనింగ్ హాల్ వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వ హయాంలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరైనప్పటికీ, భవన నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. కాలేజీ ప్రిన్సిపాల్ పలుమార్లు విజ్ఞప్తి చేయడంతో భూ కేటాయింపు, ఇతర అనుమతులు పూర్తి చేయించి, ముఖ్యమంత్రి, మంత్రి శ్రీధర్‌బాబు సహకారంతో రూ.30 కోట్లు మంజూరు చేయించాం’ అని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిరణ్మయి, ఆర్డీఓ ఎన్ఆర్ సరిత, డీసీపీ శిరీష, తహసీల్దార్ నాగయ్య, పాలిటెక్నిక్ విద్యాశాఖ ఆర్జేడీ, ప్రిన్సిపాల్ రాకేష్ పాల్గొన్నారు.