ఆదివాసీలకే ఏజెన్సీ ఉపాధ్యాయ నియామకాలు, పదోన్నతులు
ఆదివాసీ హక్కుల పరిరక్షణకు TS ATF కృషి.. టేకులపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక
టేకులపల్లి, నవంబర్ 22 (విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలోని ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు(Teacher Job Appointments), పదోన్నతులు ఆదివాసీ అభ్యర్థులతోనే(Tribal candidates) చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని TS ATF రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పాయం ఆనందరావు డిమాండ్ చేశారు. ఏజెన్సీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన ఆదివాసీ నిరుద్యోగులతో భర్తీ చేయాలని కోరారు.
ఆదివారం టేకులపల్లి మండల కేంద్రంలో TS ATF మండల నూతన కమిటీ ఎంపిక సమావేశం జిల్లా కార్యదర్శి ముడిగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మోకాళ్ల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి పాయం ఆనందరావు మాట్లాడుతూ ఆదివాసీ ఉపాధ్యాయుల వృత్తిపరమైన సమస్యల పరిష్కారంతో పాటు వారి సంక్షేమానికి సంఘం నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీల హక్కులకు భంగం కలిగించే చర్యలను ఉపాధ్యాయ సమాజం గుర్తించి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
జీవో నంబర్ 3 రద్దు వ్యవహారంలో ఆదివాసీల హక్కులకు జరిగిన నష్టాన్ని గుర్తించి, హక్కుల సాధన కోసం TS ATFను బలోపేతం చేయాలని కోరారు. ఆదివాసీ ఉపాధ్యాయులు సంఘటితమైతే ఆదిలాబాద్ నుంచి అశ్వారావుపేట వరకు గోదావరి పరివాహక ప్రాంత రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురాగల శక్తి ఉందని పేర్కొన్నారు. టేకులపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక అనంతరం నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పాయం అబ్బయ్య, ప్రధాన కార్యదర్శిగా గలిగ రాంబాబు, ఉపాధ్యక్షుడిగా మేకల రామస్వామి, మహిళా ఉపాధ్యక్షురాలిగా పాయం రాధ, కోశాధికారిగా బీరబోయిన హైమవతిని ఎంపిక చేశారు.
కార్యదర్శులుగా కుంజా సీతారాములు, చీమల మల్లయ్య, పూనెం రాజేష్, ఈసాల రాంబాబు, ఇర్ప రామకృష్ణ; మహిళా కార్యదర్శులుగా తెల్లం సుజాత, ఎట్టి అనురాధ, రేసు చైతన్య భారతి, పూనెం కల్పన, పూనెం పొట్టెమ్మ, ఈసాల అరుణలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో TS ATF జిల్లా అధ్యక్షుడు కారం రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఊకె కృష్ణ, జిల్లా కార్యదర్శులు మోకాళ్ల కృష్ణార్జునరావు, పెండెకట్ల రామనాధం, పూనం కమలాకర్, ఉపాధ్యాయులు వాసం భాస్కర్రావు, పూనెం నాగేశ్వరరావు, గొగ్గల నాగేశ్వరరావు, పాల్వంచ మండల అధ్యక్షుడు కల్తీ వీరభద్రం, కార్యదర్శి వాసం కాంతారావు తదితరులు పాల్గొన్నారు.