ఈసారి ఇందిరమ్మ చీర కలర్ ఏంటో తెలుసా..?

22-11-2026 | 12:13pm

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ చీరల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిద్దిపేట వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని తొలుత భావించినప్పటికీ, అనివార్య కారణాలతో ఈ నెల 26కు వాయిదా వేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నెల 17 నాటికే రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాలకు సుమారు 65 లక్షల చీరలను అధికారులు పంపించారు. ఆసిఫాబాద్, జనగామ, మల్కాజిగిరి వంటి జిల్లాలకు ఇప్పటికే వంద శాతం చీరలు చేరుకున్నాయి. మిగిలిన జిల్లాలకు కూడా ఇండెంట్ ప్రకారం చీరలను పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అదనంగా 5.66 లక్షల చీరలను బఫర్ స్టాక్‌గా సిద్ధం చేసింది. కొన్ని జిల్లాల్లో మహిళలు సంప్రదాయం ప్రకారం తొమ్మిది మీటర్ల చీరలు ధరిస్తుండటంతో ప్రత్యేకంగా 3.64 లక్షల చీరలను తయారు చేయించింది. వీటిని మొత్తం 20 జిల్లాల్లో పంపిణీ చేయనున్నారు. మిగిలిన 96 లక్షలకు పైగా చీరలు 6.30 మీటర్ల పొడవుతో రూపొందించారు.

ఈసారి ఇందిరమ్మ చీరలను చిలక ఆకుపచ్చ రంగులో తయారు చేశారు. తొమ్మిది మీటర్ల చీరలు ప్లెయిన్ డిజైన్‌లో ఉండటంతో పాటు డార్క్ రెడ్ కలర్ మెరూన్ బార్డర్‌తో రూపొందించారు. మరో రకం చీరలు చిలక ఆకుపచ్చ రంగులో ఆకర్షణీయమైన డిజైన్‌తో, జరీ తరహా మెరూన్ బార్డర్‌తో సిద్ధమయ్యాయి.తొమ్మిది మీటర్ల చీరలను పంపిణీ చేసే 20 జిల్లాల్లో జగిత్యాల, హనుమకొండ, భూపాలపల్లి, గద్వాల, మెదక్, ములుగు, సిద్దిపేట తదితర జిల్లాలకు ఇప్పటికే వంద శాతం సరఫరా పూర్తయినట్లు పంచాయతీరాజ్ శాఖ వర్గాలు వెల్లడించాయి.

జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, అక్కడి నుంచి గ్రామాలకు చీరలను తరలించి మహిళలకు అందించేలా అధికారులు ప్రత్యేక పంపిణీ వ్యవస్థను రూపొందించారు. నాలుగు రోజుల్లో అన్ని జిల్లాలకు అవసరమైన చీరలను చేరవేసేలా ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

గతేడాది పంపిణీ చేసిన పాలపిట్ట రంగు ఇందిరమ్మ చీరలను మహిళలు ఇప్పటికీ వినియోగిస్తున్నారని ముఖ్యమంత్రి ఇటీవల పేర్కొన్నారు. ఈసారి మహిళల అభిరుచులకు అనుగుణంగా చిలక ఆకుపచ్చ రంగు, కొత్త డిజైన్లను ఎంపిక చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కోటి మంది మహిళలకు చీరలు అందించాలనే లక్ష్యంతో ఈ నెల 26న రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

మరిన్ని వార్తలు