సింగరేణి లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటా ఇవ్వాలి
జెన్‌కో బకాయిలు రూ.59 వేల కోట్లు వెంటనే చెల్లించాలి
ఇల్లెందు టౌన్ అక్టోబర్ 5 (విజయక్రాంతి): సింగరేణి సంస్థ 2025–26 ఆర్థిక సంవత్సర వాస్తవ లాభాలను వెంటనే ప్రకటించి కార్మికులకు 40 శాతం లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్(Singareni Collieries Workers Union) ఆధ్వర్యంలో సోమవారం జేకేఓసీపీ, కేఓసీ, జీఎం కార్యాలయం, ఏరియా వర్క్‌షాప్, సివిల్, ఎస్‌అండ్‌పీసీ, ఏరియా స్టోర్, ఏరియా ఆస్పత్రి వద్ద ధర్నాలు నిర్వహించారు. అనంతరం ఆయా విభాగాల అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎండీ నజీర్ అహ్మద్ మాట్లాడుతూ సింగరేణి అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి, లాభాల సాధనలో కార్మికుల పాత్ర కీలకమని అన్నారు. గత సంప్రదాయం ప్రకారం సంస్థ లాభాల్లో కార్మికులకు 40 శాతం వాటాను ప్రకటించి చెల్లించాలని డిమాండ్ చేశారు.
సింగరేణికి టీ జెన్‌కో, ఇతర విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన సుమారు రూ.59 వేల కోట్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇప్పించాలని కోరారు. సంస్థలో ఉత్పత్తి, కార్మికుల భద్రతకు అవసరమైన మెటీరియల్, పరికరాల కొరత ఏర్పడటం ఆందోళనకరమన్నారు. బకాయిలు విడుదలైతే సంస్థ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంతో పాటు కార్మికులకు పండుగ అడ్వాన్స్, లాభాల వాటా, దీపావళి బోనస్, పీఎల్‌ఆర్ వంటి ప్రయోజనాలను సకాలంలో చెల్లించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు, ఫిట్ కార్యదర్శులు, కార్మికులు పాల్గొన్నారు.