అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి
పార్టీ అనుకూలత కాకుండా అర్హతే ప్రామాణికం కావాలి
సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ డిమాండ్
తిరుమలాయపాలెం,(విజయ క్రాంతి): అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు(Indiramma Homes) మంజూరు చేయాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ(CPI(ML) New Democracy) తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ డిమాండ్ చేశారు. పార్టీ, రాజకీయ అనుకూలత, వ్యక్తిగత పరిచయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా నిజమైన అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు.
రెండో విడత ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు లేని నిరుపేదలు, అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. కొన్ని గ్రామాల్లో తమకు అనుకూలమైన వారికే ఇళ్లు దక్కేలా కొందరు నాయకులు వ్యవహరిస్తున్నారని, అధికారులు దీనిపై దృష్టి సారించి పారదర్శకంగా అర్హులను గుర్తించాలని కోరారు. స్థానిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇల్లు అందించాలని, లేనిపక్షంలో పేదలను సమీకరించి మండలవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని రమేష్ హెచ్చరించారు.