శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి జాతీయ పురస్కారం
సారపాక కళాకారులకు అరుదైన గౌరవం
బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) సారపాకకు చెందిన శ్రీకృష్ణం వందే జగద్గురుం కోలాట బృందానికి ‘భారతీయ కోలాట కళా రత్న జాతీయ పురస్కారం–2026’(Bharatiya Kolata Kala Ratna National Award–2026) లభించనుంది. బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో నవంబరు 15న న్యూఢిల్లీలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నారు. ఈ మేరకు హైదరాబాద్లోని అకాడమీ కార్యాలయంలో అంతర్జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ చేతుల మీదుగా బృంద సభ్యులు ఎంపిక పత్రాలను అందుకున్నారు.
జాతీయ స్థాయి కార్యక్రమంలో ప్రత్యేక కోలాట ప్రదర్శనకు కూడా బృందం ఎంపికైంది. 28 రాష్ట్రాల కళాకారులు, ఎనిమిది దేశాల ప్రజాప్రతినిధులు పాల్గొననున్న ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు అవకాశం లభించడం పట్ల బృంద సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. గురువు తోకల రమేష్ మార్గదర్శకత్వంలో సంప్రదాయ కోలాట కళను ప్రోత్సహిస్తూ, కళాకారులకు శిక్షణ అందిస్తున్న బృందానికి జాతీయ పురస్కారం లభించనుండటంపై సారపాక ప్రాంతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువు రమేష్కు, బృంద సభ్యులకు పలువురు అభినందనలు తెలిపారు.