చిన్నారుల మానసిక ఆరోగ్య పరిరక్షణ అందరి బాధ్యత!

09-10-2026 | 08:44pm
  • ప్రతి చిన్నారిలోని ప్రత్యేక ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలి
  • మణుగూరు న్యాయమూర్తి కంబపు సూరిరెడ్డి

మణుగూరు, అక్టోబర్ 9(విజయక్రాంతి ): చిన్నారుల మానసిక ఆరోగ్య పరిరక్షణలో(Safeguarding Children's Mental Health) తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పాటు సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మణుగూరు న్యాయమూర్తి కంబపు సూరిరెడ్డి(Manuguru Judge Kambapu Surireddy) సూచించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని(World Mental Health Day) పురస్కరించుకుని శుక్రవారం మణుగూరు మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సంతోష్‌నగర్‌లోని శ్రీ సత్యసాయి ప్రత్యేక అవసరాల చిన్నారుల పాఠశాల, ఎంపీడీవో కార్యాలయ సముదాయంలోని భవిత పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు.

ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి కంబపు సూరిరెడ్డి మాట్లాడుతూ ప్రతి చిన్నారిలోనూ ప్రత్యేక ప్రతిభ దాగి ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. ఇతర పిల్లలతో పోల్చకుండా వారి సామర్థ్యాలను గుర్తించి, ప్రేమాభిమానాలతో ప్రోత్సహించాలని సూచించారు.చిన్నారులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచేలా ఆత్మీయ వాతావరణాన్ని కల్పించాలని, వారి మనోభావాలను గౌరవిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలిపారు. మానసిక ఆరోగ్యం, భావోద్వేగ వికాసానికి కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతో అవసరమని అన్నారు.

ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు వారి హక్కులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమాల్లో మణుగూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గురు కృష్ణ, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ సభ్యురాలు వీరంకి పద్మావతి, న్యాయవాది అంకం సర్వేశ్వరరావు, మండల న్యాయసేవాధికార సంస్థ కోఆర్డినేటర్ ఏ. రవీందర్, శ్రీ సత్యసాయి పాఠశాల కరస్పాండెంట్ నాగమణి, భవిత పాఠశాల శిక్షణ ఉపాధ్యాయులు నాగశ్రీ, శ్యాంనాయక్, ప్రణీత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు