జనజాతి గౌరవ్ దివస్ పక్వాడా కార్యక్రమాలు ప్రారంభం
ఉట్నూర్,(విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల ఆరాధ్య దైవం ధర్తి ఆబా భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి(Dharti Aaba Bhagwan Birsa Munda 151st Birth Anniversary)ని పురస్కరించుకుని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనజాతి గౌరవ్ దివస్ పక్వాడా(Janajati Gaurav Divas Pakwada) నవంబర్ 1 నుండి 15 వరకు కార్యక్రమాలను ఐటీడీఏ ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి మంద మకరందు(ITDA Utnoor PO Manda Makarandu) సోమవారం తన ఛాంబర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ.. బిర్సా ముండా చిత్రపటానికి నివాళులర్పించి, గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణలో బిర్సా ముండా చేసిన పోరాటం, త్యాగాలను స్మరించుకున్నారు.
ఈ పక్షోత్సవాల్లో భాగంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల చరిత్ర, వారి త్యాగాలు, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ సంపదపై పాఠశాలలు, కళాశాలలు, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గిరిజన యువతలో చైతన్యం కల్పించేలా వివిధ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ జనరల్ జాదవ్ వసంతరావు, ఏపీఓ పీవీటీజీ ఆత్రం భాస్కర్, ఓఎస్డీ రాజ్‌కుమార్, డీడీ అశోక్, ఈఈ జాదవ్ తానాజీ, డిప్యూటీ ఏఓ చందన్, జేడీఎం నాగభూషణం, డీఈ నవీన్ తదితర ఐటీడీఏ యూనిట్ అధికారులు పాల్గొన్నారు.