భక్తిశ్రద్ధలతో సమాధుల పండుగ
ఇల్లందు టౌన్, నవంబర్ 2 (విజయక్రాంతి): పట్టణంలో సమాధుల పండుగ వేడుకలు(Festival celebrations) ఘనంగా నిర్వహించారు. సోమవారం సాయంత్రం బందెల మల్లయ్య కుంట ప్రాంతంలోని శ్మశానవాటికలో సీఎస్ఐ చర్చి ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఈ సందర్భంగా క్రైస్తవులు తమ కుటుంబ సభ్యులు, బంధువుల సమాధులను వివిధ రకాల పూలతో అలంకరించి కొవ్వొత్తులు, విద్యుత్ దీపాలు వెలిగించారు.
మరణించిన వారి జ్ఞాపకాలను స్మరించుకుంటూ వారి ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్థనలు చేశారు. దీపాల వెలుగులతో శ్మశానవాటిక ప్రత్యేక శోభను సంతరించుకుంది. సీఎస్ఐ చర్చి ఫాస్టర్ చైర్మన్ రెవరెండ్ దైవ ప్రతాప్, బి. రాజేంద్రబాబు అయ్యగార్ల ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చర్చి సంఘ పెద్దలు, మహిళలు, యువకులు, చిన్నారులు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.