జాబ్‌ కార్డుల్లో పేర్లు మాయం!

02-11-2026 | 10:08pm

టీఏ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడంటున్న తండా వాసులు 

790 మంది గిరిజనులకు ఉపాధి దూరం 

ప్రజావాణిలో డాక్యా తండా సర్పంచ్‌ స్వప్న ఫిర్యాదు

పావన్నపేట: కరువు పరిస్థితుల్లో ఉపాధి పనులు(Employment works) చేద్దామన్నా జాబ్‌ కార్డుల్లో పేర్లు కనిపించడం లేదని డాక్యా తండా సర్పంచ్‌ స్వప్న హీరాలాల్(Dokya Tanda Sarpanch Swapna Hiralal) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం పావన్నపేట ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.

డాక్యా, ధంజా, రాజ్యా, పోంలా తండాల్లో కలిపి మొత్తం 1,069 జాబ్‌ కార్డులు ఉన్నాయని ఆమె తెలిపారు. అయితే గత నాలుగేళ్లుగా కేవలం 290 మంది పేర్లు మాత్రమే జాబ్‌ కార్డుల జాబితాలో కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో సుమారు 790 మంది గిరిజనులు ఉపాధి పనులకు(Tribals employed jobs) దూరమవుతున్నారని వాపోయారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంత నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారని, జాబ్‌ కార్డుల్లో పేర్లు లేకపోతే పనులు ఎలా చేపట్టాలని ఎంపీడీఓను ప్రశ్నించారు. ఈ సమస్యపై ఏళ్ల తరబడి అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అధికారులు వెంటనే స్పందించి అర్హులైన వారందరి పేర్లను జాబ్‌ కార్డుల్లో నమోదు చేయించి, వారికి ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్‌ చేశారు. టెక్నికల్ అసిస్టెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, సర్పంచ్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించడని, తాండాకు అస్సలు రాడని వాపోయారు. ఇట్టి సమస్యపై ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు