రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్ పోటీ
ద్వితీయ స్థానం సాధించిన ధరూర్ క్యాంప్ విద్యార్థిని హిమజకు కలెక్టర్ అభినందనలు
జగిత్యాల, నవంబర్ 02 ( విజయ క్రాంతి ): పిఎం శ్రీ పథకం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో అక్టోబర్ 30, 31 తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాక్ పార్లమెంట్ పోటీల్లో (PM Shri Mock Parliament competition)జగిత్యాల జిల్లా, ధరూర్ క్యాంప్‌లోని పి ఎం శ్రీ జెడ్పిహెచ్ఎస్ పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని హిమజ ద్వితీయ స్థానం సాధించి పాఠశాలకు, జిల్లాకు గర్వకారణంగా నిలిచింది.
ఈ సందర్భంగా నేడు జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్, జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్. దినేష్ విద్యార్థిని హిమజను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి రాము మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ప్రజాస్వామ్య విలువలు, సభా నిర్వహణ పట్ల అవగాహన పెంపొందించడంలో ఇలాంటి పోటీలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థిని హిమజ సాధించిన విజయం పాఠశాల ఉపాధ్యాయ బృందం సమిష్టి కృషికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ పోటీలకు విద్యార్థిని హిమజకు గైడ్ టీచర్‌గా ఎం. ప్రవీణ్ వ్యవహరించారు.ఈ అభినందన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ. అమర్నాథ్ రెడ్డి, గైడ్ టీచర్ ఎం. ప్రవీణ్, ఉపాధ్యాయులు శ్రీదేవి, గంగయ్య, అనూజ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.