అనుమతి లేని నర్సరీలపై కఠిన చర్యలు
* జిల్లా ఉద్యాన శాఖ అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్
ఉట్నూర్,(విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లాలో ఎవరైనా ఉద్యాన శాఖ ద్వారా లైసెన్స్ పొందకుండా, అనధికారికంగా నర్సరీలు నడిపితే కఠిన చర్యలుతీసుకుంటామని జిల్లా ఉద్యాన శాఖ అధికారి గుడిమళ్ల సందీప్ కుమార్(DHO Gudimalla Sandeep Kumar) స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం ఉట్నూరు మండలంలోని పలు కూరగాయల నారు నర్సరీలను పరిశీలించారు. నర్సరీల చట్టం ప్రకారం జిల్లాలో నడుపుతున్న కూరగాయల, పండ్ల మొక్కలు అమ్ముతున్న నర్సరీల యజమానులందరూ ఉద్యాన శాఖ ద్వారా లైసెన్సులు పొందాలని, లైసెన్స్ గడవకముందే లైసెన్సులను పునరుద్ధరించుకోవాలని, చట్టం నియమ నిబంధనలను పాటించాలన్నారు.
చట్ట ప్రకారం నియమ నిబంధనలు పాటించని నర్సరీలో సీజ్ చేస్తామని హెచ్చరించారు.నర్సరీ చట్టం నిబంధనల మేరకు రైతులకు కూరగాయల మొక్కలు వివరాలను నమోదు చేయాలన్నారు. కూరగాయ మొక్కల ధరకు అమ్ముతున్నారు, రైతుల వివరాలు వంటి తదితర వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలని, రికార్డులు ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని సూచనలు చేశారు.ఈ మేరకు నర్సరీ యజమానులకు నోటీసులు సైతం జారీ చేశారు.కొత్త లైసెన్స్ కొరకు, పునరుద్ధరణ కొరకు సంబంధిత ఉద్యాన అధికారులను లేదా జిల్లా ఉద్యాన శాఖ కార్యాలయం లో సంప్రదించాలని జిల్లా ఉద్యాన అధికారి సందీప్ కుమార్ సూచించారు.