రైల్వే విస్తరణపై నష్టపరిహారం ఏదీ?

09-10-2026 | 09:58pm

స్పష్టత ఇచ్చే వరకు సంతకాలు, సర్వేలకు అంగీకరించం: కాలనీవాసుల స్పష్టం...

ఆలేరు , అక్టోబర్ 9 (విజయక్రాంతి): భువనగిరి మున్సిపాలిటీ(Bhongir Municipality) పరిధిలోని 1వ వార్డు అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీల్లో రైల్వే ట్రాక్ విస్తరణ(Railway track expansion) నేపథ్యంలో భూములు కోల్పోతున్న కుటుంబాలకు అందించే నష్టపరిహారంపై స్పష్టత ఇవ్వాలని స్థానికులు డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి ఎంఆర్‌ఓ కార్యాలయ(Bhuvanagiri MRO Office) సిబ్బంది ఆయా కాలనీలకు వచ్చి, రైల్వే ట్రాక్ విస్తరణలో భూములు కోల్పోతున్న కుటుంబాల వివరాలను సేకరించారు.

ఇందులో భాగంగా కుటుంబ వివరాలు, ఆధార్ కార్డు నంబర్లు(Aadhaar card numbers), బ్యాంకు పాస్‌బుక్ వివరాలు(Bank passbook details), ఓటర్ ఐడీ వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంతకాలు తీసుకున్నారు. అయితే భూములు కోల్పోతున్న వారికి ఎంత నష్టపరిహారం అందిస్తారు? పరిహారం చెల్లింపు విధానం ఏమిటి? అనే అంశాలపై సిబ్బంది ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై భువనగిరి ఎంఆర్‌ఓను కలిసి తమ అభ్యంతరాలను తెలియజేశారు.

నష్టపరిహారంపై స్పష్టత ఇచ్చిన తర్వాతే తదుపరి ప్రక్రియకు సహకరిస్తామని కాలనీవాసులు స్పష్టం చేశారు. పరిహారానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే వరకు ఎలాంటి సంతకాలు చేయబోమని, సర్వేలకు కూడా అంగీకరించబోమని ఎంఆర్‌ఓకు తేల్చిచెప్పారు. తమకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నగర్, అర్బన్ కాలనీలకు చెందిన తాళ్లపల్లి చంద్రశేఖర్, మామిండ్ల కృష్ణ, కాస్పరాజు, బాలరాజు, మామిండ్ల పద్మరావు, తాళ్లపల్లి రామరాజు, తాళ్లపల్లి శివకుమార్, పృథ్విరాజు, మామిండ్ల వేణు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు