జాతీయ సమైక్యతతోనే దేశ అభివృద్ధి సాధ్యం

31-10-2026 | 11:44pm

ఆలేరు,(విజయక్రాంతి): భారతదేశాన్ని ఒకే తాటిపైకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయులు రావుల సత్యనారాయణరెడ్డి, ఎన్‌సీసీ అధికారి దూడల వెంకటేశ్ అన్నారు. రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ సమైక్యత దినోత్సవం) సందర్భంగా శనివారం ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్‌సీసీ యూనిట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని జాతీయ సమైక్యత దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్యం అనంతరం దేశంలో విడివిడిగా ఉన్న సుమారు 560 సంస్థానాలను తన ఉక్కు సంకల్పంతో భారతదేశంలో విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అందుకే ఆయనను ఉక్కుమనిషిగా పిలుస్తారని తెలిపారు.

జాతీయ సమైక్యత దినోత్సవం కేవలం వేడుక మాత్రమే కాదని, దేశ ఐక్యత, అంతర్గత భద్రత, ప్రజల మధ్య సోదరభావం పెంపొందించుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేసే రోజని అన్నారు. కుల, మత, ప్రాంతీయ భేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, ఎన్‌సీసీ విద్యార్థులు జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు ఎన్‌సీసీ విద్యార్థులు యూనిటీ రన్ నిర్వహించారు.

మరిన్ని వార్తలు