దేశంలో పేదవాళ్లకు భూములు పంచిన ఘనత ఇందిరమ్మదే

01-11-2026 | 12:14am

ఆమె ఇచ్చిన భూములే నేటికి పేదలకు జీవనాధారం

ఇందిరాగాంధీ బాటలోనే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నడుస్తున్నారు

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

సంగారెడ్డి,(విజయక్రాంతి): ఇందిరాగాంధీ(Indira Gandhi) హయాంలో పేదలకు పంపిణీ చేసిన భూములే నేటికీ అనేక కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(TPCC Working President Jagga Reddy) అన్నారు. ఆ భూములను సాగుచేసుకుంటూ పేదలు జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ 42వ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని ఐబీ చౌరస్తా వద్ద ఆమెకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పేదలకు భూములు అందించి, వారికి ఆర్థిక భరోసా కల్పించడంలో ఇందిరాగాంధీది చారిత్రక పాత్ర అని కొనియాడారు.

భూమిని పేద కుటుంబాల బతుకుదెరువుకు ఆధారంగా మార్చిన ఆమె కృషి మరువలేనిదన్నారు. బ్యాంకుల జాతీయీకరణతో సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలను చేరువ చేశారని గుర్తుచేశారు.మెదక్ ఎంపీగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన ఇందిరాగాంధీకి సంగారెడ్డితో ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. సంగారెడ్డిలో ఆమె పాల్గొన్న రెండు సభలను గుర్తుచేశారు. ప్రధాని హోదాలో జిల్లా పరిషత్ సమావేశంలోనూ పాల్గొన్నారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఓడీఎఫ్‌తోపాటు బీడీఎల్ పరిశ్రమల ఏర్పాటుకు ఆమె చేసిన కృషిని ప్రస్తావించారు.

దేశ భద్రత కోసం క్లిష్టమైన నిర్ణయాలు తీసుకున్న ఇందిరాగాంధీ 1984లో తూటాలకు బలయ్యారని అన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ పాలన దేశ పారిశ్రామిక, ఆర్థికాభివృద్ధికి పునాదులు వేసిందని పేర్కొన్నారు. దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం నుంచి వచ్చిన రాహుల్‌గాంధీ, తన నానమ్మ ఇందిరాగాంధీ ఆశయాల బాటలో ప్రజల కోసం పనిచేస్తున్నారని జగ్గారెడ్డి అన్నారు.

మరిన్ని వార్తలు