శ్రీరాంపూర్ ఏరియా ఓవరాల్ గా 94 శాతం ఉత్పత్తి
- భూగర్భ గని ఉత్పత్తిలో 105 శాతం
- ఓసీ గనుల ఉత్పత్తి 91 శాతం
నస్పూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా(Singareni Srirampur Area) అక్టోబర్ నెలలో ఓవరాల్ గా 94 శాతం ఉత్పత్తి సాధించినట్లు జనరల్ మేనేజర్ (జీఎం) మునిగంటి శ్రీనివాస్(General Manager M. Srinivas) తెలిపారు. శని వారం జీఎం కార్యాలయ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉత్పత్తి , ఉత్పాదకతలో శ్రీరాంపూర్ ఏరియా చక్కని ప్రతిభ కనబరిచిందన్నారు. అక్టోబర్ నెలలో శ్రీరాంపూర్ ఏరియాలోని ఐదు భూగర్భ గనులు, ఒక ఓపెన్ కాస్ట్ వందశాతం ఉత్పత్తి సాధించాయన్నారు. మిగిలిన ఆరు నెలల్లో నూటికి నూరు శాతం వార్షిక ఉత్పత్తి లక్ష్యాన్ని అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశారు.
భూగర్భ గని ఉత్పత్తిలో 105 శాతం
శ్రీరాంపూర్ ఏరియా అక్టోబర్ నెల భూగర్భ, ఓసీ గనుల ఉత్పత్తి లక్ష్యం 5.35 లక్షల టన్నులకు గాను 5,04,431 టన్నులతో 94 శాతం ఉత్పత్తి సాధించిందని జీఎం శ్రీనివాస్ వెల్లడించారు. SRP 3&3A గని 117 శాతం, RK NT గని 111 శాతం, ఆర్కే 5 గని 102 శాతం, RK 7 గని 101 శాతం, SRP 1 గని 100 శాతం ఉత్పత్తి సాధించాయని, IK 1A గని 94 శాతంతో స్వల్పదూరంలో ఉందన్నారు. మొత్తంగా శ్రీరాంపూర్ ఏరియా భూగర్భ గనుల ఉత్పత్తి లక్ష్యం 1.15 లక్షల టన్నులకు గాను 1,20,647 టన్నులతో 105 శాతంతో ఉత్పత్తితో ప్రతిభ కనబరిచాయన్నారు.
ఓసీ గనుల ఉత్పత్తి 91 శాతం
శ్రీరాంపూర్ ఏరియాలోని రెండు ఉపరితల (ఎస్ఆర్పీ ఓసీ, ఐకే ఓసీ) గనుల్లో సైతం ఎస్ఆర్పీ ఓసీపీ అక్టోబర్ నెలలో 101 శాతం ఉత్పత్తి సాధించినట్లు జీఎం తెలిపారు. ఐకే ఓసీ 67 శాతం ఉత్పత్తి చేయగా నవంబర్ లో నూటికి నూరు శాతం ఉత్పత్తి సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అకోబర్ నెల ఓసీల ఉత్పత్తి లక్ష్యం 4.20 లక్షల టన్నులకు గాను 3,83,784 టన్నులతో 91 శాతం సాధించినట్లు తెలిపారు. మొత్తంగా అక్టోబర్ మాసంలో ఉత్పత్తి, ఉత్పాదకత పరంగా మంచి ఫలితాలు సాధించాం, నవంబర్ మాసంలోనూ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తామని పేర్కొన్నారు.
3,868 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు
సూపర్ ఎల్నీనో కారణంగా వర్షాబావ పరిస్థితులతో నెలకొన్న బొగ్గు డిమాండ్ కు అనుగుణంగా బొగ్గు ఉత్పత్తి పెంచాల్సిన బాధ్యత సింగరేణిపై నెలకొందని జీఎం శ్రీనివాస్ అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏమాత్రం అవకాశం ఉన్నా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి కృషిచేస్తున్నామన్నారు. దాని ఫలితంగానే గత నెలతో పోల్చితే అక్టోబర్ లో శ్రీరాంపూర్ ఏరియాలో ఘనణీయంగా ఉత్పత్తి , ఉత్పాదక పెరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం సంస్థ నిర్దేశిత లక్ష్యాలను అధిగమిస్తామన్నారు.
అలాగే శ్రీరాంపూర్ ఏరియాలో మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగుల వారసులు 3,868 మందికి డిపెండెంట్ ఉద్యోగాలు కల్పించామని, 322 మంది ఉద్యోగులకు ఎల్ఎస్పీ (LSP) చెల్లించామని, 14 మందికి ఎంఎంసీ (MMC) చెల్లించామన్నారు. ఉద్యోగ విరమణ పొందిన 9,801 మంది ఉద్యోగులకు CPRMS కింద శ్రీరాంపూర్ ఏరియాలో ఇప్పటి వరకు మెడికల్ కార్డులు అందజేశామని వెల్లడించారు. ఈ విలేకరుల సమావేశంలో డీజీఎం (పర్సనల్ ) ఎస్ అనిల్ కుమార్, డీజీఎం (ఐఈడీ) రాజన్న, డీవైపీఎం క్రాంతి కుమార్ పాల్గొన్నారు.