విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలి
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
కేజీబీవీ పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన జిల్లా కలెక్టర్
కోరుట్ల రూరల్,(విజయక్రాంతి): విద్యార్థులకు(Students) నాణ్యమైన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్(Collector Satya Prasad) అన్నారు. శనివారం మండలం లోని కల్లూరు గ్రామంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (Kasturba Gandhi Balika Vidyalaya) జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అదనంగా నిర్మిస్తున్న తరగతి గదులు, డార్మెటరీ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థినులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేలా నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాలలో వాడే నిత్యవసర వస్తువులను పరిశీలించారు. వాటి నాణ్యత, నిల్వ విధానాలపై ఆరా తీశారు. వంటగదిలో పరిశుభ్రత పాటించాలని, విద్యార్థినులకు అందించే ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి జిల్లా కలెక్టర్ భోజనం చేశారు. విద్యార్థినులతో మాట్లాడి వారి చదువు, వసతులు, భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ప్రతిరోజూ విద్యార్థినులకు నాణ్యమైన, రుచికరమైన, పోషక విలువలతో కూడిన భోజనం అందించాలని సూచించారు. పాఠశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల ఆర్డీఓ జీవాకర్ రెడ్డి, డీఈఓ రాము, మండల విద్యాధికారి నరేష్ సంబంధిత అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.