రాజ్యాంగ పరిరక్షణ పేరిట కాంగ్రెస్ రాజకీయ డ్రామాలు
బిజెపి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి
ముకరంపుర,(విజయక్రాంతి): ఓటమి భయంతో అలమటిస్తున్న కాంగ్రెస్ పార్టీ, ఉనికిని చాటుకోవడానికే నవంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిరసన రాజకీయ డ్రామా మొదలుపెట్టిందని , రాజ్యాంగ పరిరక్షణ పేరిట , ఎన్నికల సంఘం , ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ చేస్తున్నది అనవసర రాద్ధాంతమేనని బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి విమర్శించారు. నంబర్ 5న కరీంనగర్లో తలపెట్టిన మహా పాదయాత్రకు సంబంధించి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని వివిధ మండలాల మహిళా మోర్చా అధ్యక్షులు, మహిళా ప్రజా ప్రతినిధులు , ముఖ్య నేతలతో సన్నాక సమావేశం కరీంనగర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు గుర్రాల నిర్మలరెడ్డి ఆధ్వర్యంలో నగరంలోని అతిధి హోటల్లో జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ స్వతంత్ర రాజ్యాంగ సంస్థలైన కేంద్ర ఎన్నికల సంఘం పై బురదజల్లుతూ, రాజ్యాంగం ప్రమాదంలో ఉందనే నిరాధార ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టేందుకు కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. బిజెపి జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మేయర్ కొలగని శ్రీనివాస్ , రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు, మాజీ జెడ్పీ చైర్మన్ కనునమల్ల విజయ లు మాట్లాడుతూ ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టను దిగజార్చేందుకు "ఓట్ల చోరీ", ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై నిరాధార ఆరోపణలు చేయడం ద్వారా రాజ్యాంగ వ్యవస్థల పట్ల కాంగ్రెస్కు ఉన్న అపనమ్మకాన్ని మళ్లీ బయటపెట్టుకుందన్నారు.
చట్టబద్ధమైన సవరణలకు, ఈవీఎం సంస్కరణలకు చట్టసభల్లో చర్చించాల్సిన విపక్షం, వీధుల్లో నిరసనలు చేస్తూ అశాంతిని సృష్టించడానికి ప్రాధాన్యం ఇవ్వడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి బిజెపి ఆధ్వర్యంలో ఈనెల 5న కరీంనగర్లో మహా పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పాదయాత్రలో ప్రజలు ,యువత , మహిళలు స్వచ్ఛందంగా భారీ ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో కరీంనగర్ నగర పాలక సంస్థ మహిళా కార్పొరేటర్లు, ,సర్పంచ్ లు వివిధ మండలాల మహిళా మోర్చా అద్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.