పద్మశాలీల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలి
చేనేత రంగ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి:బొట్ల పరమేశ్వర్
ఆలేరు,సెప్టెంబర్ 27(విజయక్రాంతి): పద్మశాలి సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆలేరు పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొట్ల పరమేశ్వర్(Botla Parameshwar) పిలుపునిచ్చారు. ఆదివారం ఆలేరు పట్టణంలోని రైల్వే గేట్ సమీపంలోని పద్మశాలి సంఘం భవనంలో సంఘం సర్వసభ్య సమావేశం ఆయన అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా పద్మశాలి సమాజ అభివృద్ధి,చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు,వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సభ్యులు విస్తృతంగా చర్చించారు.బొట్ల పరమేశ్వర్ మాట్లాడుతూ.. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు,చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు,ఇతర సహాయ సహకారాలు అందేలా సంఘం తరఫున కృషి చేయాలని సూచించారు.
సమాజ సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించుకుంటూ వాటి పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు.ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చేనేత, పద్మశాలి సమాజ అభ్యున్నతికి బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. అనంతరం పద్మశాలి సామాజిక వర్గం నుంచి ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికైన బొట్ల సంపత్, పాసికంటి సంపత్‌లను పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ సమాజానికి సేవ చేయాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పాసికంటి ధనంజయ, కోశాధికారి సబ్బుని సుభాష్, సీతా నవీన్, పద్మశాలి కుల పెద్దలు మైలబోయిన వెంకటేష్, ఎనగందల సురేష్, ఎనగందుల నర్సింగరావు, కందగట్ల నరేందర్, ఎనగందుల రమేష్, పాసికంటి సిద్ధిలింగం, పాసికంటి శ్రీనివాస్, పాసికంటి ఉపేందర్, ఏనుగందుల రవి, కటకం శ్రీనివాస్, డాక్టర్ మైలబోయిన వినోద్, పాసికంటి కృష్ణ తదితర పద్మశాలి కుల బాంధవులు పాల్గొన్నారు.