మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి మంత్రులకు ఆహ్వానం
ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి హాజరుకావాలని కోరిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, నూతన చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్..
ఆలేరు, నవంబర్ 23 (విజయక్రాంతి): ఈ నెల 27న ఆలేరు పట్టణంలో నిర్వహించనున్న వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరుకావాలని రాష్ట్ర మంత్రులను ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య(Government Whip Beerla Ilaiah), నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ సుదగాని మల్లేష్ గౌడ్ ఆహ్వానించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్చార్జి సందీప్ కుమార్లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గం పనిచేయాలని ఆకాంక్షించారు.
రైతుల సమస్యల పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధరలు, మార్కెట్ యార్డుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన రైతులకు అందేలా కృషి చేయాలని పేర్కొన్నారు. మంత్రులు కూడా ఆహ్వానంపై సానుకూలంగా స్పందించి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరవుతామని తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.