రైతు ఆగ్రహం..
తీవ్ర కోపంతో రోడ్డెక్కిన రైతు....
ప్రధాన రోడ్డుపై వరి ధాన్యం బస్తాలతో ఆందోళన...
అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం..
తాడ్వాయి, నవంబర్, 23 (విజయక్రాంతి): ఎంతో కష్టపడి రాత్రనకా, పగలనకా శ్రమిస్తున్న రైతన్నకు అడుగడుగునా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వేల రూపాయలు పెట్టుబడి పెట్టి పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవడానికి అవస్థలే ఎదురవుతున్నాయి. ధాన్యం అమ్ముకోవడానికి రోడ్డెక్కాల్సిన పరిస్థితిలు నెలకొంటున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రైతు ఏనుగు రమేష్ రెడ్డి సోమవారం తన వరి ధాన్యం బస్తాలను ఎల్లారెడ్డి, కామారెడ్డి రోడ్డుపై ఉంచి నిరసన(Farmer Protests)కు దిగారు.
రైతు రమేష్ రెడ్డి మండలంలోని దేవాయిపల్లి గ్రామ శివారులో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రానికి దాన్యం బస్తాలను తీసుకువచ్చారు. ఆయన ధాన్యం బస్తాలను ఐదు రోజుల క్రితం సింగిల్ విండో అధికారులు తూకం వేశారు.కానీ బస్తాలను గోదాముకు తరలించలేదు. దీంతో రైతు తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. ఈ విషయమై రమేష్ రెడ్డి తాడ్వాయి సింగిల్ విండో సీఈవో నరసింహులుకు పదే పదే ఫోన్ చేసి వడ్ల బస్తాలను తరలించాలని కోరాడు. ఈ విషయమై సీఈఓ మాట్లాడుతూ.. లారీలు అందుబాటులో లేవని లారీలతో తీవ్ర ఇబ్బందిగా ఉందని తెలిపారు.
అవసరమైతే మీరు సొంత ట్రాక్టర్లో గోదాముకు తీసుకు వెళ్ళవచ్చని సూచించారు. ఈ విషయమై స్పందించిన రైతు తన సొంత ట్రాక్టర్ లో 100 దాన్యం బస్తాలను వేసుకుని గోదాంకి వెళ్ళాడు. అక్కడ అధికారులు ధాన్యం బస్తాలను దించుకోమని తిరస్కరించారు.జిపిఎఫ్ ట్రాకర్ ఉన్న వాహనాల నుంచి మాత్రమే ధాన్యాన్ని దించుకుంటామని తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రైతు తిరిగి కొనుగోలు కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి కొనుగోలు కేంద్రం పక్కనే ఉన్న ఎల్లారెడ్డి,కామారెడ్డి రోడ్డుపై వరి ధాన్యం బస్తాలను ఉంచి ఆందోళనకు దిగారు. రైతు రమేష్ రెడ్డియే కాకుండా చాలామంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో దాన్యం అమ్ముకోవడానికి తీవ్ర తంటాలు పడుతున్నారు.
కొనుగోలు కేంద్రంలో 874 బస్తాల తూకం..
ఐదు రోజుల క్రితమే కృష్ణాజివాడి కొనుగోలు కేంద్రంలో 874 బస్తాలు తూకం అయ్యాయి.అందులో ఏనుగు రమేష్ రెడ్డికి చెందిన 467 బస్తాలు, బద్దం రామిరెడ్డికి చెందిన 407 బస్తాలు ఉన్నాయి.ఈ బస్తాలను గోదాంకు తరలించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
సీఈఓపై ఆగ్రహం..
స్థానిక సీఈవో నరసింహులు పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జిపిఎస్ ట్రాకర్ ఉన్న వాహనాలనే అనుమతిస్తారని తెలిసి ఉన్న ఆయన మాకు తప్పుడు సమాచారం ఇచ్చి ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. అధికారులు బాధ్యతగా విధులు నిర్వహించాలి కానీ తప్పుడు సమాచారం ఇవ్వవద్దన్నారు.ఈ విషయం తెలుసుకున్న తాడువాయి సింగిల్ విండో చైర్మన్ సంతాజి గారి సుధాకర్ రావు ఘటన స్థలానికి చేరుకొని రైతు రమేష్ రెడ్డిని సముదాయించారు.ట్రాక్టర్ కిరాయి,హమాలీల ఖర్చులు తామే భరిస్తామని రైతుకు నచ్చజెప్పి ఆందోళనను విరివింపజేశారు.ఇకముందు అయినా రైతులకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను కోరుతున్నారు.