చీకటిపైవెలుగుకాంతులే దీపావళి!
భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో(Indian culture and traditions) దీపావళికి ఎంతో ప్రాముఖ్యత.. ప్రత్యేకత ఉంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయానికి ప్రతీకగా చెబుతుంటారు. అయితే పండుగ వెనుక ఉన్న కథ, కథనాలు, ఆచార వ్యవహారాలు, పూజా విధానాలపై(Stories, narratives, customs and traditions, and methods of worship) ఇప్పటికే కొందరిలో సందేహాలు లేకపోలేదు. వాటిని నివృత్తి చేసే విషయాలను, దీపావళి ప్రాశస్యం గురించి ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త లత జంధ్యాల(Latha Jandhyala) ‘విజయక్రాంతి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే పాఠకుల కోసం..
దీపావళి.. 5రోజుల పండుగ!
సాధారణంగా దీపావళి అంటే రెండు రోజులు సంబురాలు ఉంటాయని అందరికీ తెలుసు. ఒక రోజు భోగి, ఒక రోజు నోములు, పూజలు ఉంటాయని పలువురు చెబుతుంటారు. కానీ, ఐదు రోజుల పండుగ అని పేర్కొన్నారు లతా జందేల. ధన త్రయోదశి నుంచి ఈ సంబురాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అయితే, ఈ ఐదు రోజుల పండుగ ఉత్తర భారతదేశంలో ఎక్కువగా పాటిస్తారని చెప్పారు.
ఒక్కో రోజుకు ఒక్కో ప్రాధాన్యం కూండా ఉందన్నారు. మొదటి రోజైన ధన త్రయోదశి నాడు బంగారం కొనుగోళ్లతో సందడి నెలకొంటుంది. ఈ ఆనవాయితీ ఎప్పటి నుంచి ఉందనేది పక్కనపెడితే.. త్రయోదశి పదానికి ముందు ధన అని ఉండడంతో బంగారం కొంటే ఆర్థికంగా కలిసొస్తుందనే నమ్మకం ప్రజల్లో బలపడి పోయిందని లతా పేర్కొన్నారు. చరిత్రలో మాత్రం ఆ రోజున బంగారం కొనాలనే మాట ఎక్కడా చెప్పబడలేదని స్పష్టం చేశారు. ‘వాస్తవానికి ధన త్రయోదశి రోజున కొందరు యుముడికి నువ్వుల నూనెతో దీపారాధన చేస్తుంటారు. తద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయని ధర్మాల్లో ఉంది..’ అని ఆధ్మాత్మికవేత్త లత వెల్లడించారు.
సాధారణంగా నరక చతుర్దశి రోజున లేదా దీపావళి రోజున గానీ దీపాలు పెట్టాలనుకుంటారు చాలామంది, కానీ.. ధన త్రయోదశి రోజున యముడికి చేసే దీపారాధన నుంచే దీపావళి వరకు దీపాలు పెట్టడం కొనసాగుతుందని పేర్కొన్నారు. ‘ఇక ఐదు రోజుల దీపావళి పండుగలో కీలకమైనది నరక చతుర్దశి. నరకాసురుడిని అమ్మవారు వధించిన రోజుగా పేర్కొంటారు, అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెబుతుంటారని లత వివరించారు.
లక్ష్మీదేవి రాకను గోవులు వ్యతిరేకించిన రోజే అమావాస్య!
దీపావళి వేడుకల్లో అమావాస్య రోజున కొందరు నోములు(గౌరీదేవి పూజలు) ఆచరిస్తుంటారని లత పేర్కొన్నారు. అయితే, ఆ రోజున నోములు నోచుకోవడం వెనుక ఒక చిన్న కథ ఉందన్నారు. ‘కృతయుగంలో ఒకసారి ప్రపంచమంతటా క్షామం వచ్చిందట. దాన్నుంచి రక్షించాలని బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని కోరుకున్నాడు. అందుకు లక్ష్మీదేవి ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున భూమి మీదకి వచ్చింది. క్షామం వల్ల ఎవరి ఇంట్లో చూసిన అనారోగ్యకర వాతావరణం చూసి అనుగ్రహించేందుకు లక్ష్మీదేవికి మనసు అంగీకరించలేదు.
ప్రజలు ఎవరూ ఉన్నదాంట్లో ఆనందంగా ఉండే పరిస్థితి లేదు. అందుకు తాను అనుగ్రహించనని బ్రహ్మదేవుడికి చెప్పిందట. అలా ముందుకు సాగుతున్న లక్ష్మీదేవి కశ్యప ప్రజాపతి గోశాల వద్దకు వెళ్లిందట. అమ్మవారి రాకను గోవులు వ్యతిరేకించాయట. మాకు ధనంతో పని లేదు. అప్పుడు అమ్మవారు ఒక పలుకు పలికారట. గోవులు అంగీకరించని ఏ దేవుళ్లు, దేవతలకు ఎక్కడా విలువ ఉండదని విష్ణువుతో అన్నారట. వాస్తవానికి లక్ష్మీదేవి విష్ణుమూర్తి గుండెలపైనే ఉంటారనేది ప్రతీతి.
గోవుల తిరస్కారంతో ఆమె నోట పలికిన వ్యాఖ్యలతో ఆమెకు విష్ణుమూర్తి చెంతకు చేరుకునే అవకాశం లేకపోయింది. ఈ క్రమంలో గోవుల తిరస్కరణను వెనక్కి తీసుకోవాలని కోరిందట. అందుకు గోవులు లక్ష్మీదేవిని తమలోనే ఉండిపోవాలని చెప్పాయట. అందువల్లే చాలా మంది ఆవుల వెనుక భాగంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మొక్కుతుంటారు. ఆనాటి నుంచి గోశాలలోనే ఉంటున్న లక్ష్మీదేవిని అమావాస్య రోజున పూజిస్తూ వస్తున్నాం..’ అని ఆస్ట్రాలజర్ లత వెల్లడించారు. అందుకే పండుగల వేళ గోవుల పేడతో వాకిళ్లు అలుకుతుంటారు. దానివల్ల లక్ష్మీదేవి వారింటికి వస్తారనే నమ్మకం కొందరిలో ఉందన్నారు.
దీపాల వెలుగులో..
దీపావళి అంటే ఇళ్ల ముంగిట్లో దీపాలు వెలిగించడం అందరికీ తెలిసిందే. దీపం జ్ఞానానికి ప్రతీక అని లత పేర్కొన్నారు. ‘దీపాల్లోనే లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారని నమ్మకం. దీపం పెట్టడం వల్ల పితృ దేవతలకు మార్గం కనిపించడం కోసమనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. దీపాలతోపాటు టపాసులు కాల్చడం వెనుక కూడా ఇదే ఆంతర్యం దాగుందంటారు. వీటిలో వెలుతురు విరజిమ్మే టపాసులే ప్రధానం. దీపావళి అమావాస్య రోజున ఆవు నెయ్యితో దీపాలు వెలిగించడం శుభకరం. ఆ రోజున ఉపవాసం పాటించడం కూడా శ్రేయస్కరమే’నని ఆధ్మాత్మికవేత్త లత వివరించారు.
ఆఖరి రోజు బలిపాడ్యమి..
దీపావళి వేడుకల్లో చివరి రోజు బలిపాడ్యమి కూడా ముఖ్యమైనదేనని, దానికి ఒక పురాణ గాథ ఉందని ఆస్ట్రాలజర్ లత తెలిపారు. ‘బలి చక్రవర్తి పేరు అందరూ వినే ఉంటారు. గొప్ప మహారాజు. ప్రహ్లాదుడి మనవడు. మహా విష్ణు భక్తుడు కూడా. అంతేకాదు, దానగుణంలో బలికి ఎవరూ సాటిలేరేమో! అలాంటి బలి చక్రవర్తి ఈ భూమండలాన్నంతా ఆక్రమించేసుకున్నాడు. ఒక్క భూమండలాన్నే కాదు, సమస్త ముల్లోకాలను ఆక్రమించుకున్నాడు. అప్పుడు ఇంద్రుడి పదవికి ఇబ్బంది వచ్చింది. ఇంద్రుడు విష్ణువు వద్దకు వెళ్లి జరిగింది చెబుతాడు. అప్పుడే విష్ణువు వామనవతారం ఎత్తుతాడు.
బలి చక్రవర్తి దాన గుణాన్ని ఆసరా చేసుకుని వామనవతారంలో ఉన్న విష్ణుమూర్తి బలిని మూడడుగుల స్థలం కావాలని వరం కోరుతాడు. అలా బలి చక్రవర్తిని పాతాళలోకానికి పంపించేస్తాడు. పురాణాల ప్రకారం.. బలి చక్రవర్తి బలిపాడ్యమి రోజున తిరిగి భూమిపైకి వస్తాడు అని చెబుతుంటారు. ఆ రోజున విష్ణు నామస్మరణలో ఉన్న వారిని బలి అనుగ్రహిస్తాడని ప్రతీతి. అందువల్ల బలిపాడ్యమి రోజున బలిని స్మరించడం, దానధర్మాలు చేయడం మంచిది..’ అని ఆధ్యాత్మిక వేత్త లత వివరించారు.
చివరిగా భగిని హస్త భోజనం..
భగిని హస్త భోజనం అనేది ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చినట్లు ఆస్ట్రాలజర్ లత పేర్కొన్నారు. పురాణాల ప్రకారం చూస్తే.. ‘యముడు, యమున ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. తన కార్యనిర్వహణలో యముడు ఎప్పుడూ తీరిక లేకుండానే ఉంటారు. తన ఇంటికి భోజనానికి రావాలని చెల్లెలు యము న ఆహ్వానించినా.. యముడికి సమయం లేక వాయిదా వేసేవాడట. చెల్లెలి అసంతృప్తిని చూడలేక ఎట్టకేలకు కార్తీక మాసం తొలి విదియ రోజున భోజనానికి వస్తానని యముడు చెల్లెలికి మాటిచ్చాడట.
ఆ ప్రకారం యముడు విదియ రోజున చెల్లెలి చేతివంట ఆరగించాడని చెబుతుంటారు. దీన్నే భగిని హస్తభోజనంగా పేర్కొంటారు..’ అని లత వివరించారు. అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు మరింత బలపడడానికి కూడా ఈ భోజనం అనే ఆచారం ఉపకరిస్తుందని లత చెప్పారు. అంతేకాదు, ఆ రోజున ఆడపడుచుల చేతివంట తిన్న సోదరుల ఇబ్బందులు తొలగిపోతాయని యముడు వరం ఇచ్చాడని ప్రతీతి. అయితే, ధన త్రయోదశి, భగిని హస్తభోజనం ఎక్కువగా ఉత్తర భారతదేశంలో పాటిస్తారని లత జంధ్యాల స్పష్టం చేశారు.