లేడీ డాన్ నీతూబాయి అరెస్ట్!

08-11-2026 | 05:20am

తొమ్మిదేళ్లుగా గంజాయి దందా 

ఐటీ ఉద్యోగులు, విద్యార్థులే లక్ష్యం

   2017 నుంచి నానక్‌రాంగూడ కేంద్రంగా కుటుంబ సభ్యుల సహకారంతో వ్యాపారం నిందితురాలిపై 30కి పైగా కేసులు 

ఎట్టకేలకు అరెస్టు చేసిన ఈగల్ ఫోర్స్-అక్రమ ఆస్తులపై అధికారుల నిఘా

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో తొమ్మిదేళ్లుగా గంజాయి దందా(Cannabis Trade) నిర్వహిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న కలపాటి నీతూ బాయి(Kalapati Neetu Bai) (51)ని తెలంగాణ ఈగల్ ఫోర్స్ పోలీసులు(Telangana Eagle Force Police) ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. నానక్‌రాంగూడ కేంద్రంగా 2017 నుంచి కుటుంబ సభ్యుల సహకారంతో గంజాయి వ్యాపారం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భారీగా గంజాయిని కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఐటీ ఉద్యోగులు, విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించారు.

ఆమెతో సహా ఆమె కుటుంబ సభ్యులపై సుమారు 30కిపైగా డ్రగ్స్, ఎక్సైజ్ కేసులు నమోదైనట్లు సమాచారం. గతంలో మూడు ఆపరేషన్లలో రూ.67 లక్షల నగదు, 51.5 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె కుమారుడు 2023లో 22 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు. పలుమార్లు అరెస్టయి బెయిల్‌పై బయటకు వచ్చినా తిరిగి గంజాయి దందా కొనసాగించిన నీతూ బాయి, ఫోన్ వినియోగించకుండా ప్రాంతాలు మారుస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు.

శుక్రవారం మంగళ్‌హట్‌వైపు ఆటోలో వెళ్తుండగా ఈగల్ బృం దం ఆమెను అదుపులోకి తీసుకుంది. ఆమె ఇంటికి సుమారు 50 మంది వినియోగదారులు వచ్చివెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు.  లంగర్‌హౌజ్‌లో రెండు జీ+3 భవనాలు, గచ్చిబౌలిలో జీ+2 భవనంతో పాటు ఇతర ఆస్తులను అక్రమ సంపాదనతో కొనుగోలు చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల ఆమె అక్రమ సంపాదన, మనీలాండరింగ్ వ్యవహారాలపై ఈడీ కూడా సోదాలు నిర్వహించడం గమనార్హం.

మరిన్ని వార్తలు