60 రోజులు నిద్ర.. రూ. 9.6 లక్షల ప్రైజ్ మనీ
- లక్కీ ఇంటర్న్‌షిప్‌లో ముంబై మహిళ రికార్డు
- విదేశీ విహార యాత్ర అవకాశం కూడా..
ముంబై, నవంబర్ 7: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 60 రోజు పాటు హాయిగా నిద్రపోయినందుకు ఓ మహిళ ఏకంగా రూ.9.6 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకుంది. అంతేకాదు.. ఒక విదేశీ విహార యాత్రను(Trip Abroad) కూడా ఉచితంగా పూర్తి చేసే అరుదైన అవకాశాన్ని పొందింది. ఆశ్చర్యంగా ఉంది కదూ.. వేక్‌ఫిట్ అనే ప్రముఖ మ్యాట్రెస్ సంస్థ స్లీప్ ఐదో సీజన్ పోటీ నిర్వహించింది. దీనికి 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో 10 మందిని మాత్రమే ఎంపిక చేసి నిద్ర పోటీ నిర్వహించారు. వారికి 60 రోజుల పాటు క్రమబద్ధమైన నిద్ర అలవాట్లు పాటించడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం, నిద్ర సరళిని ట్రాక్ చేయడం వంటి బాధ్యతలు అప్పగించారు.
పోటీని కేవలం నిద్రకే పరిమితం చేయకుండా ప్రతి వారం సృజనాత్మక సవాళ్లతో 60 రోజులపాటు ఆసక్తికరంగా కొనసాగించారు. ‘స్లీప్ సినిమా’ కాన్సెప్ట్‌లో ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్ర థీమ్‌తో పునఃసృష్టించాలి. ‘స్లీప్ బింగో’లో తమ నిద్ర అలవాట్లను సమీక్షించుకోవాలి. మరో ఛాలెంజ్‌లో సంభాషణ మధ్యలో ఎదుటి వారికి తెలియకుండా ‘దుప్పటి’, ‘దిండు’ అనే పదాలను పది సార్లు ఉపయోగించాలి. ప్రతి వారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘ప్రో స్లీపర్ ఆఫ్ ది వీక్’ బిరుదు ఇచ్చారు.
ఫైనల్లో హైదరాబాదీ
రత్నగిరికి చెందిన మణికందన్, ముంబైకి చెందిన జినియా ఛటర్జీ, మెహెక్ ఖోన్ టాప్ నిలిచారు. వారం వారీ సృజనాత్మక ఛాలెంజ్‌లలో అత్యధిక విజయాలు సాధించిన హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ఫైనల్‌కు చేరాడు. దీంతో నలుగురితో ‘బిగ్ బెడ్’ పేరుతో గ్రాండ్ ఫినాలే నిర్వహించారు. అందులో మెమరీ ఫోమ్ ఛాలెంజ్, స్లీప్ యాక్షన్ వంటి ఆసక్తికరమైన పోటీలు నిర్వహించారు. చివరి రాత్రి నిద్ర స్కోర్లతో పాటు మొత్తం ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వారిని విజేతగా నిర్ణయించారు. విజేతగా నిలిచిన జినియా ఛటర్జీ రూ.9.6 లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నారు. మరో 65 మందికి రూ.లక్ష చొప్పున ప్రోత్సాహకాన్ని అందించారు.