హైదరాబాద్‌లో వైభవంగా సదర్ సంబురాలు

08-11-2026 | 05:15am
  1. ప్రత్యేక ఆకర్షణగా కేరళ ‘బాహుబలి’ దున్నపోతు
  2. ముకుతాడు పట్టుకుని శోభాయాత్రలో పాల్గొన్న 
  3. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ముషీరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): భాగ్యనగర సంస్కృతీ సంప్రదాయాలకు(Bhagyanagara Cultural traditions) ప్రతీకగా నిలిచే చారిత్రాత్మక సదర్ ఉత్సవాలు హైదరాబాద్లో వైభవంగా జరిగాయి. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని నారాయణగూడ, చెప్పల్ బజార్లో యాదవ సమాజం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సదర్ సంబరాల్లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేరళ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘బాహుబలి’ అనే భారీ దున్నపోతు ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దున్నపోతును తిలకించిన కిషన్ రెడ్డి స్వయంగా దాని ముకుతాడు పట్టుకుని యాదవ సోదరులతో కలిసి శోభాయాత్రలో పాల్గొన్నారు. డప్పు దరువులు, సంప్రదాయ నృత్యాలు, దున్నపోతుల ప్రదర్శనలతో చెప్పల్ బజార్ పరిసరాలు సందడిగా మారాయి.

హైదరాబాద్‌కే ప్రత్యేకమైన సదర్ పండుగ

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ నిజాం కాలం నుంచి హైదరాబాద్లో దీపావళి అనంతరం సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. యాదవ సమాజం నాయకత్వంలో దున్నపోతులను అందంగా అలంకరించి నిర్వహించే ఈ సంప్రదాయ వేడుక దేశంలోనే ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ఏడాది పొడవునా దున్నపోతులను ఎంతో శ్రద్ధతో పెంచి, దృఢంగా తీర్చిదిద్ది పండుగ సందర్భంగా బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, బస్తీ ప్రజలతో కలిసి సంబరాలు చేసుకోవడం ఆనందదాయకమన్నారు.

గత 30 ఏళ్లుగా తాను క్రమం తప్పకుండా సదర్ వేడుకల్లో పాల్గొంటున్నానని తెలిపారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం నారాయణగూడలో జరిగే ప్రధాన సదర్ ఉత్సవాలకు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. చెప్పల్ బజార్లోని స్వర్గీయ పరశురామ్ యాదవ్ నివాసం నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుందని వివరించారు.

చిట్టబోయిన కుటుంబం ఆధ్వర్యంలో ఏర్పాట్లు

ఈ ఏడాది సదర్ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచేందుకు కేరళ నుంచి అత్యంత శక్తివంతమైన ‘బాహుబలి’ దున్నపోతును తీసుకువచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. చిట్టబోయిన కుటుంబానికి చెందిన నంద కిషోర్ యాదవ్, లడ్డు యాదవ్, వారి సోదరులు ప్రతి సంవత్సరం సామూహికంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారని అభినందించారు. ఈ ఏడాది కూడా అన్ని ఏర్పాట్లను అద్భుతంగా పూర్తి చేశారని పేర్కొన్నారు.దీపావళి, సదర్ పండుగల సందర్భంగా యావత్ ప్రజానీకానికి, కేంద్ర ప్రభుత్వం తరఫున, ప్రధాని నరేంద్ర మోదీ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు