గవర్నర్ కోటాపై చర్చించలేదు
- ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై త్వరలోనే నిర్ణయం
- నామినేటెడ్ పోస్టుల భర్తీకి ముమ్మర కసరత్తు
- కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ల నియామకాలు
- రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై అధిష్ఠానానికి నివేదిక సమర్పించా
- టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై(Selection of candidates for MLC) ఇప్పటి వరకు ఎలాంటి చర్చ జరగలేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) స్పష్టం చేశారు. ఈ అంశంపై నాయకత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి రానుందని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో నామినేటెడ్ పదవులను(Nominated positions) కూడా త్వరలోనే భర్తీ చేస్తామని, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు డైరెక్టర్ పోస్టులకు కూడా నియామకాలు చేపడుతామని తెలిపారు. శనివారం హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
తెలంగాణలో పార్టీ పరిస్థితిపై అధిష్ఠానానికి నివేదిక సమర్పించినట్లు మహేశ్‌కుమార్ గౌడ్ తెలిపారు. అధిష్టానం మునుపటిలా లేదని, నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు వివరణ కోరుతుందని, ఇందుకోసం ఏఐసీసీలో ప్రతేక్యంగా ఒక వ్యవస్థే పనిచేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన మూడు రోజులు నివేదిక వెళ్లకుంటే ఢిల్లీ నుంచి వెంటనే మెసేజ్ వస్తుందని తెలిపారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేక వ్యూహంతో ముందుకెళ్తున్నామని వివరించారు. మంత్రులతో కలిసి ఎమ్మెల్యేలు, నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని, రెండు స్థానాల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు టీపీసీసీ చీఫీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే దీపావళి పండుగ.. ప్రతి ఇంటా వెలుగులు నింపి, కుటుంబాల్లో నూతనోత్సాహం తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ తమ కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి పండుగను సంతోషంగా జరుపుకోవాలని, సమాజంలో ప్రేమ, సోదరభావం, ఐక్యత మరింత బలోపేతం కావాలని కోరారు.