ఇదేం లక్కీ ఛాన్స్! నిద్రపోతే రూ.9.6 లక్షలు

07-11-2026 | 12:04pm

60 రోజులు నిద్రపోయి.. రూ.9.6 లక్షలు గెలిచింది!

సాధారణంగా ఉద్యోగం చేయాలంటే గంటల తరబడి పనిచేయాలి. కానీ ఇక్కడ మాత్రం రోజూ హాయిగా నిద్రపోతే చాలు.. లక్షల రూపాయల బహుమతి సొంతం చేసుకోవచ్చు! వినడానికి వింతగా ఉన్నా ఇది నిజమే. ముంబైకి చెందిన జినియా ఛటర్జీ తన నిద్రతోనే ఏకంగా రూ.9.6 లక్షలు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రముఖ మ్యాట్రెస్ బ్రాండ్ వేక్‌ఫిట్ నిర్వహించిన ఐదో సీజన్ Sleep Internship పోటీలో జినియా విజేతగా నిలిచింది. ఈ పోటీలో దేశవ్యాప్తంగా 2 లక్షలకు పైగా దరఖాస్తులు రావడంతో, అందులో నుంచి కేవలం 10 మందిని ఎంపిక చేశారు. వారికి 60 రోజుల పాటు మంచి నిద్ర అలవాట్లను పాటించే అవకాశం కల్పించారు. ప్రతిరోజూ నిర్ణీత సమయం నిద్రపోవడం, Sleep Schedule పాటించడం, నిద్ర నాణ్యతను ట్రాక్ చేయడం ఈ పోటీలో కీలక అంశాలుగా నిలిచాయి.

అయితే ఈ Internship కేవలం పడుకుని నిద్రపోవడంతోనే ముగియలేదు. పోటీదారుల Creativity, Presence of Mind పరీక్షించేందుకు ప్రతి వారం ప్రత్యేక Challenges నిర్వహించారు. ప్రముఖ సినిమాల్లోని సన్నివేశాలను నిద్ర థీమ్‌తో రూపొందించే ‘Sleep Cinema’, తమ నిద్ర అలవాట్లను అంచనా వేసుకునే ‘Sleep Bingo’ వంటి టాస్క్‌లు ఇందులో ఉన్నాయి. మరో ఆసక్తికరమైన ‘Undercover Sleep Mission’లో సంభాషణ సాగిస్తున్న సమయంలో ఎదుటివారికి అనుమానం రాకుండా ‘దుప్పటి’, ‘దిండు’ అనే పదాలను పదిసార్లు ఉపయోగించాల్సి వచ్చింది. ప్రతి వారం ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ‘Pro Sleeper of the Week’ గుర్తింపు ఇచ్చారు. చివరకు రత్నగిరి మణికందన్, జినియా ఛటర్జీ, మెహెక్ ఖోట్ టాప్-3లో నిలిచారు. వారపు ఛాలెంజ్‌లలో అత్యుత్తమ ప్రదర్శనతో హైదరాబాద్‌కు చెందిన కరీం ఖాన్ కూడా Wild Card Entry ద్వారా ఫైనల్‌కు చేరాడు. దీంతో నలుగురు పోటీదారుల మధ్య ‘Big Bed’ పేరుతో Grand Finale నిర్వహించారు.

ఫైనల్‌లో Memory Foam Challenge, Sleep Auction వంటి టాస్క్‌లతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. చివరి రాత్రి నమోదైన Sleep Scoresతో పాటు వివిధ టాస్క్‌లలో చూపిన ప్రతిభను పరిగణనలోకి తీసుకుని విజేతను ప్రకటించారు. అన్ని విభాగాల్లోనూ మెరుగైన ప్రదర్శన చేసిన జినియా ఛటర్జీ విజేతగా నిలిచి రూ.9.6 లక్షల నగదు బహుమతితో పాటు ఒక విహారయాత్రను కూడా సొంతం చేసుకుంది. 2019లో ప్రారంభమైన ఈ వినూత్న Sleep Internship కార్యక్రమానికి ఇప్పటివరకు గత ఐదు సీజన్లలో భారీ స్పందన లభించింది. మొదటి నాలుగు సీజన్లలోనే 10 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటివరకు 65 మంది ఇంటర్న్‌లు ఒక్కొక్కరు రూ.లక్ష చొప్పున Stipend అందుకున్నారు. మొత్తానికి మంచి నిద్ర ఆరోగ్యానికే కాదు.. అదృష్టం కలిసొస్తే లక్షల ఆదాయానికి కూడా మార్గం చూపిస్తుందని ఈ పోటీ మరోసారి చాటిచెప్పింది!

మరిన్ని వార్తలు