కొడంగల్‌కు ఫుల్.. మునుగోడుకు నిల్!
- ఫ్లోరైడ్ పీడిత ప్రాంతంపై కనికరం లేదు
- సీఎంను, డిప్యూటీ సీఎంను కోరినా నిధులు రాలే
- మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ బ్యూరో/మునుగోడు, నవంబర్ 7 (విజయక్రాంతి): కొడంగల్ నియోజకవర్గంలో(Kodangal Constituency) రూ.9 వేల కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపనలు చేస్తున్నారని, ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ సమస్యతో(Fluoride problem) బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గానికి అభివృద్ధి నిధులు ఎందుకు కేటాయించడం లేదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ప్రశ్నించారు. అదృష్టం కలిసి వచ్చి రేవంత్‌రెడ్డి సీఎం పదవిలో ఉన్నారని, కానీ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని స్పష్టం చేశారు.
మునుగోడు పట్టణంలో శనివారం జరిగిన పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయుడు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సమాజంలో అవినీతి పేరుకుపోతోందని, నాయకులు నీతిగా ఉంటేనే ప్రజలకు నీతివంతమైన పాలన అందుతుందని అన్నారు.
నాయకులు అవినీతికి పాల్పడితే పేదలకు న్యాయం జరగదని అభిప్రాయపడ్డారు. మునుగోడు అభివృద్ధి పట్ల తనకు ప్రత్యేకమైన తపన ఉందని, సీఎంను, డిప్యూటీ సీఎంను పలుమార్లు కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించానని తెలిపారు. అయినా నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజకవర్గాలను గుర్తించి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, పలువురు నాయకులు పాల్గొన్నారు.