సరికొత్త కాకతీయ!
బండి సంపత్‌కుమార్ :
(మహబూబాబాద్, విజయక్రాంతి) : 1976 అక్టోబర్ 4న సికింద్రాబాద్ నుంచి కాజీపేట, వరంగల్(From Secunderabad to Kazipet, Warangal) వరకు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉండే విధంగా ప్రారంభించిన కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు(Kakatiya Express train) 50 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని సాగించిన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పాత ఐసీఎఫ్ కోచ్‌లకు బదులుగా, రెండు రోజుల క్రితం అత్యాధునిక ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను ప్రవేశపెట్టారు. దీంతో 50 ఏళ్లుగా ప్రయాణికులకు సేవలందిస్తున్న కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలు ఇప్పుడు సరికొత్తగా మారింది.
మొదటగా ఈ రైలు సికింద్రాబాద్ నుండి వరంగల్ వరకు నడపగా తర్వాత, డోర్నకల్ వరకు పొడిగించి ఆ తదుపరి ప్రస్తుతం భద్రాచలం రోడ్డు (కొత్తగూడెం) వరకు పొడిగించారు. ఉదయం 5:10 గంటలకు కొత్తగూడెంలో బయలుదేరి అదేరోజు ఉదయం 11:40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరిగి సాయంత్రం 5 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి రాత్రి 11:45 గంటలకు కొత్తగూడెం చేరుతుంది. గతంలో పూర్తిగా సాధారణ ప్రయాణికులకు జనరల్ కోచ్‌లతో ప్రయాణికులకు సేవలు అందించగా, కరోనా తర్వాత ఈ రైలును ఎక్స్‌ప్రెస్ రైలుగా మార్చారు.
జనరల్ సిట్టింగ్ తోపాటు సెకండ్ సిట్టింగ్ రిజర్వేషన్, 3 ఏసీ, 3 ఏసీ ఎకానమీ కోచ్‌లతో నడుపుతున్నారు. ప్రతిరోజు సికింద్రాబాద్, కొత్తగూడెం మధ్య నడిచే కాకతీయ ఎక్స్‌ప్రెస్ రైలును ఇప్పుడు ఆధునీకరించి, 130 నుంచి 160 కిలోమీటర్ల వేగంతో వెళ్లినా ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండే విధంగా రూపొందించిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లతో నడుపుతుండడంతో 50 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయ ఎక్స్ ప్రెస్ రైలు ఇప్పుడు మరింత సౌకర్యవంతంగా మారింది.