దీపావళికే 4.5 లక్షల కొత్త పింఛన్లు!
నేడు కొడంగల్‌లో ముఖ్యమంత్రి రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
ఈ నెల నుంచే నూతన లబ్ధిదారులకు చెల్లింపులు
హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి) : దీపావళి పండుగ(Festival of Diwali) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన మరో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు(Cheyutha Pensions) అందించనుంది. సీఎం రేవంత్ రెడ్డి... ఆదివారం తన సొంత నియోజకవర్గమైన కోడంగల్‌లో నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క పాల్గొననున్నారు.
వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులు తదితర వర్గాల్లోని అర్హులైన వారికి కొత్తగా పింఛన్లు మంజూరు చేయనున్నారు. కోడంగల్‌లో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి కొంతమంది నూతన లబ్ధిదారులకు పింఛన్ల మంజూరు పత్రాలను అందజేస్తారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా అర్హులైన లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు ఈ నెల నుంచే పింఛన్ అందించనున్నారు.