ఎమర్జెన్సీ విధించడం తప్పే

08-11-2026 | 05:40am
  1. మా కుటుంబంలో చీలికకు కారణమైంది
  2. సంజయ్‌ను అదుపులో ఉంచితే నష్టం తగ్గేది
  3. ఓ ఇంటర్వ్యూలో సోనియా గాంధీ మనోగతం

న్యూఢిల్లీ, నవంబర్ 7: భారత రాజకీయ చరిత్రలో(History of Indian Politics) అత్యంత వివాదాస్పద ఘట్టాల్లో ఒకటైన ‘ఎమర్జెన్సీ(Emergency)’ విధింపు తప్పే అని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ కారణంగా తమ కుటుంబంలో విభేదాలు కూడా వచ్చాయని చెప్పారు. 1975 నుంచి 1977 వరకు ఇందిరా గాంధీ(Indira Gandhi) దేశంలో ఎమర్జెన్సీ విధించారని.. ఆ రెండేళ్లలో ఇందిరా గాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ అరాచకాలను అదుపు చేసి ఉంటే నష్టంలో చాలా వరకు నివారించగలిగే వారని అన్నారు. సోనియా గాంధీ ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం విడుదలకు ముందు సోనియా రెండు ఆంగ్ల పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన జీవితానికి, భారత రాజకీయాలకు సంబంధించిన పలు అంశాలను పంచుకున్నారు. 

సంజయ్ ఒంటెత్తు పోకడతోనే నష్టం

దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఇందిరా గాంధీపై సంజయ్ గాంధీ తీవ్ర ఒత్తిడి తెచ్చారని.. రాజీవ్ గాంధీ వ్యతిరేకించినా వినకుండా ఇందిరా ఎమర్జెన్సీని ప్రకటించారని నాటి రోజులను సోనియా గుర్తు చేసుకున్నారు. ఇందిరా ఎన్నికను అలహాబాద్ హైకోర్టు కొట్టివేయడం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం ఎమర్జెన్సీ విధించాల్సిందేనని ఒత్తిడి చేయడంతో ఇందిరా ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ సమయంలో పౌర హక్కులపై ఆక్షలు, ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, పత్రికా స్వచ్ఛపై నియంత్రణలు తీవ్ర వివాదానికి కారణాలయ్యాయన్నారు.

సంజయ్ గాంధీకి క్యాబినెట్‌లో లేదా ప్రభుత్వంలో ఎలాంటి పదవి లేకున్నా ఇందిరాపై గణనీయమైన ప్రభావం చూపేవారన్నారు. ప్రతిపక్షాల దూకుడును ఆపాలని సంజయ్ పట్టుబట్టడంతో ఎమర్జెన్సీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. సంజయ్ గాంధీ ఒంటెత్తు పోకడలతో పాటు బలవంతపు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, ఢిల్లీలో మురికివాడల తొలగింపు వంటి చర్యలతో పరిస్థితి చేయిదాటిపోయిందని, తప్పులను గుర్తించే సరికి సమయం మించిపోయిందని, తర్వాత ఇందిరా గాంధీ క్షమాపణ కూడా చెప్పారని సోనియా గుర్తు చేశారు. ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ అనే సోనియా ఆత్మకథ ఈ నెల 10వ తేదీన విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు