గిరిజన హక్కుల కోసం సేవాలాల్ సేన పోరు

30-10-2026 | 03:41pm

చివ్వెంల: కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోత్ హుస్సేన్ నాయక్ డిమాండ్ చేశారు.

సేవాలాల్ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య నాగు నాయక్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘గిరిజన గళం.. తండాలలో నిద్ర’ కార్యక్రమంలో భాగంగా గురువారం చివ్వెంల మండల పరిధిలోని బద్య తండాలో బానోత్ హుస్సేన్ నాయక్ తన బృందంతో కలిసి రాత్రి బస చేశారు. శుక్రవారం తండాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాష్ట్ర మంత్రివర్గంలో లంబాడీలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం ఆ వర్గాన్ని అవమానించడమేనని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు విశ్వవిద్యాలయాల్లో రిజర్వేషన్లు (Reservations) కల్పించాలని, అన్ని రంగాల్లో గిరిజనులకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన హక్కులను అమలు చేయాలని కోరారు. లంబాడీలు మాట్లాడే గోర్ బోలి భాషకు (Gor Boli Language) ఎనిమిదో షెడ్యూల్‌లో చోటు కల్పించి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర రాజధాని నడిబొడ్డున సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా గిరిజన మ్యూజియం (Tribal Museum) ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన సాధు సంతులకు ధూపదీప నైవేద్యాల కోసం ఆర్థిక సహాయంతో పాటు గౌరవ వేతనం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గిరిజనుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి హక్కుల సాధన కోసమే తండాలలో నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు హుస్సేన్ నాయక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు ధరావత్ రాజేష్ నాయక్, సర్పంచులు బానోత్ సైదా నాయక్, బానోత్ కిషన్, ధరావత్ నాగులు, ధరావత్ వీరన్న, బానోత్ వీరేష్, బానోత్ భీమ, బానోత్ బాలు నాయక్, తరుణ్, రాజశేఖర్, రవి, నరేష్, శివరామ్, సేవ్య, చక్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు