సీతారాంపల్లిలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన గ్రామ పాలకవర్గం.. ఆటపాటలతో సందడిగా పండుగ
సిద్దిపేట రూరల్, అక్టోబర్ 16: మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో(Sitarampalli Village) సద్దుల బతుకమ్మ పండుగను(Bathukamma Festival) ఘనంగా నిర్వహించారు. పండుగను పురస్కరించుకొని గ్రామ పాలకవర్గం ఆధ్వర్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి ఆటపాటలతో, కోలాటాలతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ పండుగ సంబరాలను జరుపుకున్నారు. గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా మహిళల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామస్తులంతా ఐకమత్యంతో జరుపుకోవడం ఆనందంగా ఉందని స్థానికులు పేర్కొన్నారు. పండుగ విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన గ్రామ ప్రజలకు గ్రామ పాలకవర్గం కృతజ్ఞతలు తెలిపింది.