రసాభాసగా మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం

09-10-2026 | 12:19am

- ఎంఎల్ఏ, మంత్రి వర్గాల కార్పొరేటర్ ల మధ్య వాగ్వాదం

- ఇద్దరు కార్పొరేటర్లకు నోటీసులు జారీ చేసిన మేయర్

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్(Mancherial Municipal Corporation) సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. గురువారం మంచిర్యాల నగరపాలక సంస్థ మేయర్ ధరణి మధుకర్  అధ్యక్షతన సభ ప్రారంభమైన కొద్ది సమయంలోనే స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్ రావు, మంత్రి వివేక్ వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కౌన్సిల్ హాల్ సాక్షిగా మరోసారి బయటపడ్డాయి. కనీసం పారిశుద్ధ కార్మికులను సైతం విధులకు హాజరుకాకుండా చేస్తూ పెన్షన్ల అర్జీల కొరకు డివిజన్లో మరొక వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగిస్తూ అర్హులైనటువంటి వారి నుండి ఐదు నుండి పదివేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేయగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్న సమయంలో ఇరువర్గాల మహిళా కార్పొరేటర్లు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో సభలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. 52వ డివిజన్ కార్పొరేటర్ సాయిని స్రవంతి తన డివిజన్‌లోని ప్రజా సమస్యలపై మాట్లాడుతుండగా మంత్రి వివేక్ వర్గానికి చెందిన మహిళా కార్పొరేటర్లు అడ్డుతగిలారు. మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంపై ఇరువర్గాలు పట్టుబట్టడంతో వివాదం మొదలైంది. చూస్తుండగానే మాటామాటా పెరిగి ఇరువర్గాల మహిళా కార్పొరేటర్లు ఒకరిపై మరొకరు దూసుకెళ్లారు.

తీవ్ర వాగ్వాదంతో పాటు తోపులాట జరగడంతో కౌన్సిల్ హాల్‌లో ఏం జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఒకే పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు గ్రూపులుగా విడిపోయి గొడవ జరుగుతుండడంతో తోటి సభ్యులు, అధికారులు జోక్యం చేసుకుని సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ చాలాసేపటి వరకు సభలో ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. ఇదే తరుణంలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గాజులు ముఖేష్ గౌడ్ మాట్లాడుతూ నిరుపేదలైన బలహీన వర్గాల కోసం నిర్మించినటువంటి ఇండ్లను పంపిణీ చేయడంలో విఫలమయ్యారని పారదర్శకత పాటించకపోవడంతో నిబంధనలను అతిక్రమించి ఎలా ఎంపిక చేస్తారని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి కార్యకర్తలను మాత్రమే ఇండ్లను లబ్ధిదారుల గుర్తించి కేటాయించడం విమర్శలకు దారితీసింది. మరో వైపు కార్పొరేషన్ లో నెలకొన్న సమస్యల పరిష్కారంలో అధికారులు వివక్ష చూపుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వర్గానికి చెందిన కార్పొరేటర్లకు, అసమ్మతి వర్గం కార్పొరేటర్లు సమస్యలపై చర్చ సందర్భంగా పరస్పరం అభ్యంతరాలు వ్యక్తం చేసుకున్నారు. కార్పొరేషన్ లోని అనే డివిజన్లకు నిధులు కేటాయించడం లేదని, కొన్ని డివిజన్ లకు నిధులు వెచ్చిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా కార్పొరేటర్లు అయితే ఓ సమయంలో కోట్లాడుకుంటారేమో అనేంత వరకు  వెళ్ళింది. బిఆర్ఎస్ కార్పొరేటర్లు మాట్లాడుతూ కాలనీలలో పారిశుద్ధ్య సమస్య రోజురోజుకు పెరిగిపోతుందని కోతులు కుక్కల బెడద అధికమవుతున్నప్పటికీ పాలకవర్గం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్పొరేటర్ రాజేశ్వరి ఇందిరమ్మ ఇండ్లు,పెన్షన్ పథకాలు మంజూరు చేసేందుకు మేయర్ ధరణి మధుకర్ ప్రైవేటు అనుచరులతో లంచాలు తీసుకుంటారని ఆరోపించడంతో కార్పొరేటర్ సాయిని స్రవంతి జోక్యం చేసుకొని కార్పొరేటర్ చేతిలో ఉన్న మైక్ లాక్కునే ప్రయత్నం చేయగా ఇరువురు వ్యక్తిగత ఘర్షణలకు దిగారు.

అనంతరం గోదావరి నది పరివాహక ప్రాంతంలో మంచిర్యాల పట్టణంలోని ఆసుపత్రులలో వెలువడే వ్యర్ధాలను డంపు చేయడంతో త్రాగునీరు కలుషితం అవడం  కాకుండా రానున్న పుష్కరాలకు రానున్న భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తరలించే ఏజెన్సీని రద్దు చేయాలని కార్పొరేటర్లు కోరడంతో మేయర్ సానుకూలంగా స్పందించి రద్దు చేసేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఇరువురు మహిళా కార్పొరేటర్లు సభ నియమ నిబంధనలు పాటించలేదని ఏకవాక్యంతో సంబంధించిన మాటలకు మేయర్ వారికి షోకాస్ నోటీస్ జారీ చేశారు. రసాభాసగా సాగిన ఈ సమావేశంలో కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యుల తోపాటు కార్పొరేటర్లు,మున్సిపల్ కమిషనర్ అన్వేష్, అసిస్టెంట్ కమిషనర్ రాజు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు