ఆర్వీఎంలో ఉచిత గుండె వైద్య శిబిరం
గజ్వేల్, సెప్టెంబర్ 29: వరల్డ్ హార్ట్ డే సందర్భంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజల సౌకర్యార్థం ఆర్వీఎం చారిటబుల్ ట్రస్ట్ హాస్పిటల్‌లో(RVM Charitable Trust Hospital) మంగళవారం ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా సేవాభావంతో ఏర్పాటు చేసిన 1250 పడకల ఆస్పత్రిలో నిర్వహించిన ఈ శిబిరానికి పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. శిబిరంలో గుండె సంబంధిత సమస్యల కోసం ఈసీజీ, 2డీ ఎకో, లిపిడ్ ప్రొఫైల్, ఆర్‌బీఎస్ తదితర పరీక్షలను ఉచితంగా నిర్వహించారు.
అవసరమైన కొంతమంది రోగులకు మందులను కూడా ఉచితంగా అందజేశారు. శిబిరం ద్వారా తమలో దాగి ఉన్న గుండె సంబంధిత సమస్యలు వెలుగులోకి వచ్చాయని పలువురు రోగులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ భానుకిరణ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీనారాయణ, ఆర్వీఎం సీఈఓ దేవరకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.