అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం
సకాలంలో స్పందించిన 108 సిబ్బంది
ఇచ్చోడ, సెప్టెంబరు 29 (విజయక్రాంతి): పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్‌లోనే సిబ్బంది ప్రసవం చేశారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా(Adilabad District) సిరికొండ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన లక్ష్మీబాయికి మంగళవారం పురిటినొప్పులు అధికమయ్యాయి. దీంతో ఆమె భర్త 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఇచ్చోడ 108 అంబులెన్స్ సిబ్బంది సకాలంలో స్పందించి లక్ష్మీబాయిని ఆసుపత్రికి తరలించేందుకు బయలుదేరారు.
అయితే మార్గమధ్యలో నొప్పులు తీవ్రం కావడంతో పరిస్థితిని గమనించిన ఈఎంటీ రాకేష్ అంబులెన్స్‌లోనే ఆమెకు ప్రసవం చేశారు. లక్ష్మీబాయి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం తల్లీబిడ్డలను ఇచ్చోడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.తల్లీబిడ్డలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారని 108 అంబులెన్స్ పైలెట్ నాగరాజు తెలిపారు. అత్యవసర సమయంలో సకాలంలో స్పందించి గర్భిణికి సురక్షితంగా ప్రసవం చేయడంపై కుటుంబ సభ్యులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.