జెడ్‌పీ హైస్కూల్‌లో ఘనంగా పిల్లల పార్లమెంట్ ప్రదర్శన

29-09-2026 | 10:11pm

వెంకటాపురం నూగూరు, సెప్టెంబర్ 29/ విజయ క్రాంతి:ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని జెడ్‌పీ హైస్కూల్‌లో మంగళవారం కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ(CAFED is a charity organization) ఆధ్వర్యంలో మాక్ పిల్లల పార్లమెంట్ ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు మాక్ పార్లమెంటు సమావేశాల నిర్వహణ, సభా విధానాలు, మంత్రుల బాధ్యతలు, ప్రశ్నోత్తరాల సమయం తదితర అంశాలను పాత్రధారణ ద్వారా ప్రదర్శించారు.

కార్యక్రమానికి పాఠశాల హెచ్‌ఎం జి.వి. సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల ప్రదర్శనను తిలకించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ చిన్న వయస్సులోనే విద్యార్థులకు ప్రజాస్వామ్య వ్యవస్థ, పార్లమెంటరీ విధానాలపై అవగాహన కల్పించడం అభినందనీయమని అన్నారు.ఇలాంటి కార్యక్రమాలు పిల్లల్లో ఆత్మవిశ్వాసం,నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తాయని తెలిపారు.కాఫేడ్ సంస్థ డైరెక్టర్ లూర్థురాజు మాట్లాడుతూ పిల్లల పార్లమెంట్ ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, సభలో మాట్లాడే ధైర్యాన్ని పెంచడమేనని అన్నారు.

పిల్లలు పుస్తకాల్లో చదివే విషయాలను ప్రాక్టికల్‌గా తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో  సర్పంచ్ తాటి సరస్వతి, కోఆర్డినేటర్లు గొంది హనుమంత్, కామేష్, ప్రశాంత్, నరేష్, భాస్కర్, ఉషా, ఇందిరా, పద్మ, రమాదేవి, సుజాత, దీపరాణి, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు, వంశీ, జయరాం,శేషు, నరసింహారావు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు