బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆదివాసీ నాయకులు..
ఉట్నూర్, సెప్టెంబర్ 29 ( విజయక్రాంతి): ఖానాపూర్ నియోజకవర్గంలో(Khanapur Constituency) ఉట్నూర్, ఇంద్రవెల్లి మండలాలకు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల సీనియర్ ఆదివాసీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా వారు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరిలో యువజన కాంగ్రెస్ ఖానాపూర్ నియోజకవర్గ అధ్యక్షులు, కొత్తగూడ గ్రామ మాజీ సర్పంచ్ ఆత్రం రాహుల్ తో పాటు మాజీ ఎంపీటీసీ సభ్యులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు సీనియర్ ఆదివాసీ నాయకులు ఉన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే బలమని, తెలంగాణ ప్రజల హక్కులు, సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీ నిరంతరం ప్రజల తరఫున పోరాడుతుందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేస్తూ, ప్రజలకు అండగా నిలవాలని సూచించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న భూక్యా జాన్సన్ నాయక్ తో కలిసి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చి, ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల ఆశలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రజలకు చెప్పుకోదగ్గ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కనిపించడం లేదని, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయని వారు పేర్కొన్నారు.
రైతులు, గిరిజనులు, యువత, మహిళలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, గిరిజన ఆదివాసీల హక్కులు, సంక్షేమం, ఆత్మగౌరవం కోసం కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే బీఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నామని నాయకులు తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గంలో భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ రోజురోజుకూ బలోపేతం అవుతోందని, అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ప్రజా సమస్యల పరిష్కారం కోసం మరింత బలంగా ముందుకు సాగుతామని వారు అన్నారు.
రానున్న రోజుల్లో ఖానాపూర్ నియోజకవర్గంలో భూక్యా జాన్సన్ నాయక్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని, బీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం మరింత పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనమని, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మరింత బలమైన ప్రజా ఉద్యమంగా ముందుకు సాగుతుందని వారు ధీమా వ్యక్తం చేశారు.