యూపీఐ చార్జీలను ఉపసంహరించుకోవాలి
- సిపిఐ మండల కార్యదర్శి బోనగిరి రూపేష్
బెజ్జంకి,(విజయక్రాంతి): యూపీఐ లావాదేవీల(UPI transactions)పై ప్రతిపాదిస్తున్న వ్యాపారి రుసుములను కేంద్ర ప్రభుత్వం(Central Government) ఉపసంహరించుకోవాలని సిపిఐ బెజ్జంకి మండల కార్యదర్శి బోనగిరి రూపేష్ డిమాండ్ చేశారు. యూపీఐ చెల్లింపులు సామాన్య ప్రజలు, చిన్న వ్యాపారులు, కార్మికులు, విద్యార్థులు, యువత రోజువారీ జీవితంలో కీలకంగా మారాయని తెలిపారు.
కొత్త రుసుముల విధానం వల్ల భవిష్యత్తులో చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి(Self-employment) పొందుతున్న యువతపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. వ్యాపారులపై విధించే ఎలాంటి రుసుములనూ వినియోగదారులపై అదనపు భారంగా మోపకుండా ప్రభుత్వం కఠినంగా పర్యవేక్షించాలని కోరారు. యూపీఐ వ్యవస్థ ప్రజల సౌకర్యం కోసం కొనసాగాలని, అదనపు లేదా దాచిన చార్జీలకు అవకాశం లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని రూపేష్ డిమాండ్ చేశారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని యూపీఐ చార్జీల ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరారు.