టీబీ రహిత పంచాయతీగా బచ్చాయిపల్లి

08-10-2026 | 11:22pm

జిల్లాలో ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో చోటు

సిద్దిపేట రూరల్,(విజయక్రాంతి): టీబీ నియంత్రణలో బచ్చాయిపల్లి గ్రామ పంచాయతీ(Bachayipally Gram Panchayat) ముందడుగు వేసింది. సెంట్రల్ టీబీ డివిజన్ ఆధ్వర్యంలో 2025–26 సంవత్సరానికి చేపట్టిన టీబీ రహిత(TB control) గ్రామ పంచాయతీల ఎంపికలో బచ్చాయిపల్లి ఎంపికైంది. జిల్లాలో టీబీ రహిత పంచాయతీలుగా ఎంపికైన 12 గ్రామ పంచాయతీల్లో రూరల్ మండలం బచ్చాయిపల్లి చోటు దక్కించుకుంది. ఈ సందర్భంగా పంచాయతీకి జిల్లాస్థాయి అవార్డుతో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేసి సన్మానించారు.

జిల్లా మెడికల్ ఆఫీసర్ డా. ధన్‌రాజ్, టీబీ ఇన్‌చార్జి మెడికల్ ఆఫీసర్ వినోద్ బాబ్జీ ఆధ్వర్యంలో అవార్డు, ప్రశంసాపత్రాన్ని బచ్చాయిపల్లి సర్పంచ్ దుర్గం ప్రేమలత యాదగిరికి అందజేశారు. గ్రామంలో టీబీ వ్యాధి నిర్ధారణ, నివారణ, చికిత్సపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వ్యాధి నియంత్రణకు తీసుకున్న చర్యలను పరిగణనలోకి తీసుకుని పంచాయతీని ఎంపిక చేసినట్లు తెలిపారు.

అప్రమత్తతే రక్షణ

టీబీ అంటువ్యాధి అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని వైద్యాధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలతో పాటు మందులు, చికిత్స ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రెండు వారాలకు మించి దగ్గు కొనసాగడం, కఫంలో రక్తం పడటం, రాత్రివేళ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దని సూచించారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు