కొత్తపల్లిలో రీ-సర్వేపై అవగాహన గ్రామ సభ
జిన్నారం: ప్రభుత్వం డ్రోన్, రోవర్ సాంకేతికతతో చేపడుతున్న భూముల రీ-సర్వే(Land re-survey)పై కొత్తపల్లి గ్రామంలో అవగాహన గ్రామ సభ నిర్వహించారు. ఐదు గ్రామాల్లో పైలట్ సర్వే విజయవంతం కాగా, ఇప్పుడు కొత్తపల్లి గ్రామం(Kothapalli Village) ఎంపికైంది. ఈ సర్వే తెలంగాణ సర్వే చట్టం 1923 ప్రకారం జరుగుతుంది. ప్రతి భూమికి ఖచ్చితమైన హద్దులు, డిజిటల్ రికార్డులు, శాశ్వత భూధార్ నంబర్ వస్తాయని అధికారులు వివరించారు. హద్దు తగాదాలు తగ్గుతాయని తెలిపారు. సర్వే రోజున రైతులు పొలం వద్ద ఉండి హద్దులు చూపాలని, పాస్బుక్, పహాణీ, దస్తావేజులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. వివాదం ఉంటే 60 రోజుల్లో అప్పీలు చేసుకోవచ్చని తెలిపారు. ఇది టైటిల్ నిర్ణయం కాదని, ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దని అధికారులు స్పష్టం చేశారు.