హయత్‌నగర్‌ను ఫ్యూచర్ సిటీలో చేర్చొద్దు

19-11-2026 | 10:55pm

ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలి

బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్

ఎల్బీనగర్: హయత్ నగర్(Hayathnagar)ను కొత్తగా ఏర్పాటు చేయబోయే ఫ్యూచర్ సిటీ(Future City)లో కల్పాలనే ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని  బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు   కుంట్లూరు వెంకటేశ్ గౌడ్, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్(BC Peoples Federation President Bongu Venkatesh Goud) హెచ్చరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..‌ ఫ్యూచర్ సిటీ పేరుతో  కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని అందులో భాగంగానే ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, షాద్‌నగర్, కల్వకుర్తి, దేవరకొండ నియోజకవర్గాలతోపాటు హయత్‌నగర్ ప్రాంతాన్ని చేర్చాలని ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు. 

ఫ్యూచర్ సిటీ  జిల్లాలో హయత్ నగర్ ని చేర్చే ఆలోచన విరమించుకోవాలని కోరారు.  హయత్‌నగర్ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన భౌగోళిక, సామాజిక, రాజకీయ ప్రాధాన్యత ఉందన్నారు. హయత్‌నగర్ మండలాన్ని మరో జిల్లాలో విలీనం చేయకుండా హయత్‌నగర్ ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

ఇక్కడి ప్రజల అభిప్రాయాలను, జనాభా ప్రాతిపదికను, భౌగోళిక పరిస్థితులను, స్థానిక ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా సంఘాల నాయకులు ఘోర శ్యాంసుందర్ గౌడ్ మద్దిమడుగు రాజశేఖర్, నూకల మల్లేష్ యాదవ్, దినేష్ కుమార్, పందిరి వినోద్ గౌడ్, గుర్రం విజ్ఞాన్ రెడ్డి, ఎర్ర శ్రీహరి గౌడ్, గజ్జె శ్రీనివాస్ గౌడ్ , కారింగుల నరేందర్ గౌడ్, రాజనగర శ్రీకాంత్, పందుల వెంకటేష్ గౌడ్, ఉయ్యాల కుమార్ గౌడ్, కొంగరి కృష్ణ పద్మశాలి, మామిడి గిరీష్ గౌడ్ పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు