మండీ బిర్యానీతో అనారోగ్యం? 9 మందికి అస్వస్థత

19-11-2026 | 11:27am

ఒక్క భోజనం.. తొమ్మిది మందికి అనారోగ్యం! హైదరాబాద్‌లో ఏం జరిగింది?

హైదరాబాద్: హోటల్‌లో మండీ బిర్యానీ(Mandi Biryani) తిన్న ఓ కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తిన్న కొద్దిసేపటికే కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి తొమ్మిది మంది వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు చిన్నారులు కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. అంబర్‌పేటలో నివసించే ఓ కుటుంబం ఈ నెల 15న గాంధీ బొమ్మ సమీపంలోని ఓ బిర్యానీ హోటల్ నుంచి మండీ బిర్యానీ తెప్పించుకుంది.

బంధువులతో కలిసి భోజనం చేసిన కొద్దిసేపటికే తొమ్మిది మందికి వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు హోటల్ యజమానిని నిలదీయగా, బాధితులకు స్థానికంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే బాధితుల్లో ఓ మహిళకు న్యూరో సంబంధిత సమస్య తలెత్తడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం తొమ్మిది మందినీ బుధవారం నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రికి(Fever Hospital Nallakunta) తీసుకొచ్చారు.

అయితే అక్కడ ఏడేళ్లలోపు చిన్నారులకు చికిత్స అందించే సదుపాయం లేకపోవడంతో పాటు, ప్రైవేట్ ఆసుపత్రి రిపోర్టులో మహిళకు న్యూరో సమస్య ఉన్నట్లు పేర్కొనడంతో బాధితులందరినీ మెరుగైన చికిత్స కోసం ఉస్మానియా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనలో సయ్యద్ నసీమ్ సుల్తానా, ఖతీజ తుల్ కుబ్రా, ఆస్మా సుల్తానా, కాచిగూడ నెహ్రూనగర్‌కు చెందిన మహ్మద్ ఆమీర్ తదితరులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ ఘటనతో నగరంలో Food Safety, హోటళ్లలో ఆహార నాణ్యతపై మరోసారి చర్చ మొదలైంది. అయితే అస్వస్థతకు కారణం ఆహార కలుషితమేనా అనే విషయాన్ని సంబంధిత అధికారుల పరిశీలన, వైద్య పరీక్షలు నిర్ధారించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు