దేశాభివృద్ధికి ఇందిరాగాంధీ చేసిన సేవలు చిరస్మరణీయం
బాన్సువాడ, నవంబర్ 19 (విజయ క్రాంతి): భారత మాజీ ప్రధాని, భారతరత్న ఇందిరాగాంధీ 109వ జయంతి సందర్భంగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని ఇందిరా చౌక్ వద్ద గురువారం ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొని ఇందిరాగాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధానిగా ఇందిరాగాంధీ అమలు చేసిన సంస్కరణలు భారత చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని పేర్కొన్నారు. 1969లో 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం, 1974లో పోఖ్రాన్లో తొలి అణు పరీక్ష నిర్వహించడం ఆమె నాయకత్వ పటిమకు నిదర్శనమన్నారు. 'గరీబీ హటావో' నినాదంతో పేదరిక నిర్మూలనకు ఆమె విశేష కృషి చేశారని కొనియాడారు.దేశ ఐక్యత, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఇందిరాగాంధీ చేసిన సేవలు ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.