అనాథ గృహ విద్యార్థికి చేయూత
ఎంబీబీఎస్ కోర్సు, వసతి గృహం ఫీజు చెల్లిస్తున్న
సరూర్ నగర్ నివాసి రజనీకాంత్
ఎల్బీనగర్, అక్టోబర్ 24 : ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి(Orphan student) గృహం అనేక మంది అనాథలకు ఆశ్రయం కల్పించి, భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నది. అనేక దాతలు తమ వంతుగా విరాళాలు(Donations) అందించి, సహకరిస్తున్నారు. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజిలో(Government Medical College, Mahabubnagar) ఎంబీబీఎస్ చదువుతున్న అనాథ విద్యార్థి గృహం విద్యార్థి రమావత్ హనుముకు సరూర్ నగర్ ఎస్వీకాలనీ వాసి, ప్రస్తుతం ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్న చింతల రజనీకాంత్ శనివారం రూ .35వేల విలువైన సాంసంగ్ కంపెనీకి చెందిన కంప్యూటర్ ఐపాడ్ ను బహుకరించారు.
ఈ సందర్భంగా రజినీకాంత్ మాట్లాడుతూ.. నాన్న చనిపోయి, ఆర్థిక స్థోమత లేక చదువు ఆపే దశలో ఉన్న అనాథ విద్యార్థి గృహంలో ఉంటున్న రమావత్ హనుము మహబూబ్ నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీటు సాధించడం స్ఫూర్తినీయమన్నారు. హనుము ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేయడానికి మొత్తం కాలేజీ ఫీజు, వసతి ఫీజును చెల్లిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతము ఫైనల్ ఇయర్ విద్యార్థి అని, పీజీ కోర్స్ ఎంట్రన్స్ కు ప్రిపేర్ కావడానికి ఐపాడ్ అందజేస్తున్నానని పేర్కొన్నారు. కార్యక్రమంలో అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్, దాత రజనీకాంత్ తల్లిదండ్రులు చింతల భారతి, శౌరి పాల్గొన్నారు.