ప్రయాణికులకు ఇబ్బందులు రావొద్దు
- ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- చింతలకుంటలో సులభ్ కాంప్లెక్స్ పనుల పరిశీలన
ఎల్బీనగర్, నవంబర్ 2 : ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా సేవలు అందించాలని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి(MLA Sudheer Reddy) సూచించారు. చింతలకుంట లోని ఎల్పీటీ మార్కెట్ సర్వీస్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మిస్తున్న సులభ్ కాంప్లెక్స్ పనులను సోమవారం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ... దూర ప్రాంతాలకు ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న బస్ స్టాప్ వద్ద సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
సర్వీస్ రోడ్డుపై తీవ్ర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ట్రాఫిక్ డ్రైవ్ నిర్వహించి వాహనదారులు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సింధూర్ ఎన్క్లేవ్ కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేని కలిసి తమ కాలనీలోకి వెళ్లేందుకు ప్రత్యేకంగా రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. సంబంధిత అధికారులతో చర్చించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.