నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలి
- ధరల పట్టిక తప్పనిసరిగా ప్రదర్శించాలి
- నిబంధనలకు విరుద్ధంగా బియ్యం విక్రయిస్తే చర్యలు
- జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని
ములుగు, నవంబర్ 2 (విజయక్రాంతి): జిల్లాలో వ్యాపారులు నిర్ణీత ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి షా ఫైజల్ హుస్సేని(District Civil Supplies Officer Shah Faisal Hussain) ఒక ప్రకటనలో తెలిపారు. రైస్‌మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు బియ్యం ధరల పట్టికను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 26 కిలోల బస్తా విక్రయించే బియ్యానికి కిలోకు గరిష్ఠ రిటైల్ ధరలు బీపీటీ, కేఎన్ఎం రకానికి 66 రూపాయలు, ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనాకు 74రూపాయలు, హెచ్ఎంటీ, జేఎస్ఆర్ రకానికి 79 రూపాయలుగా పేర్కొన్నారు. ఆయా రకాల బియ్యాన్ని నిర్ణయించిన ధరలకు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ప్రతి కొనుగోలుకు వినియోగదారులకు తప్పనిసరిగా బిల్లు అందించాలని వ్యాపారులకు సూచించారు.
వినియోగదారులు బియ్యం కొనుగోలు సమయంలో ధర, తూకం, నాణ్యతను పరిశీలించి బిల్లు తీసుకోవాలని కోరారు. అధిక ధరలకు విక్రయించినా, ఇతర అక్రమాలను గుర్తించినా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.